పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు- మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్
T Congress: సొంత ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ నే రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేయడం దుమారం రేపింది. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ గీత దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సరైన సమయంలో నిర్ణయం
ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ పరిశీలన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో కొండా సురేఖ విషయంలోనూ అదే జరిగిందన్నారు. మొదటిసారే ఏఐసీసీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రెండు మూడుసార్లు పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ చర్యలు తీసుకుందని వివరించారు.
