Congress : మంత్రులకు తెలియకుండానే సాగర్ నుండి నీళ్లు దోచుకెళ్లారా?
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టన్నెల్ నిర్మాణం చేసి తాగు నీటి పేరిట సాగు నీటిని తరలిస్తుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్నదాతలకు సాగు నీరు ఇవ్వమంటే ఇవ్వకుండా.. పొరుగు రాష్ట్రం అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి యథేచ్ఛగా నీటిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసింది.అయితే, దీనిపై నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరో విధంగా స్పందించడం హాస్యాస్పదంగా మారింది. తన గురువు చంద్రబాబు కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకపోయినా సంబంధిత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేర్లెస్గా వ్యవహరించడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. నాగార్జున సాగర్ నీటిని ఏపీ దోచుకువెళ్తోందని సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రిని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.
