రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. నాగార్జున సాగర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టన్నెల్ నిర్మాణం చేసి తాగు నీటి పేరిట సాగు నీటిని తరలిస్తుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్నదాతలకు సాగు నీరు ఇవ్వమంటే ఇవ్వకుండా.. పొరుగు రాష్ట్రం అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి యథేచ్ఛగా నీటిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసింది.
అయితే, దీనిపై నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరో విధంగా స్పందించడం హాస్యాస్పదంగా మారింది. తన గురువు చంద్రబాబు కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకపోయినా సంబంధిత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేర్లెస్గా వ్యవహరించడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. నాగార్జున సాగర్ నీటిని ఏపీ దోచుకువెళ్తోందని సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రిని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.
మంత్రుల ద్వందవైఖరి..
‘ఏపీ జల దోపిడికి పాల్పడేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి మాకు ఎప్పుడో తెలిసింది. దీనిపై జలవివాదాల ట్రిబ్యునల్స్‌కు మేము ఫిర్యాదు కూడా చేశాము’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, అదే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం భిన్నమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ఏపీ జల దోపిడికి పాల్పడేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి మాకు ఇప్పుడే తెలిసింది. ఏడాది నుండి ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వు ఆంధ్రా వాడివి కాబట్టి ఆంధ్రాకు సపోర్ట్ చేస్తున్నావా? అని నాగార్జున సాగర్ ఈఈపై సీరియస్ అయ్యాను’ అని పేర్కొనడం గమనార్హం. కాగా, ఏపీ జలదోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కంటితుడుపు చర్యలు..
ఏపీ జలదోపిడీ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేవలం కండితుడుపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుంచి అక్రమంగా నీళ్లు తరలించుకుపోయేందుకు విజయపురి సౌత్ వద్ద రూ.1,200 కోట్లతో మూడు ఇంటేక్ వెల్స్‌తో పాటు 200 ట్యాంకులను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఏడాదిగా పనులు జరుగుతున్నా తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీస్తూ నాగార్జున సాగర్ సూపరింటెండెంట్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఇంత పెద్ద ప్రాజెక్టు ఏడాదిగా నిర్మాణం జరుగుతుంటే రేవంత్ రెడ్డికి, ఇద్దరు నల్గొండ మంత్రులకు తెలియకుండా ఉంటుందా? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలిసే ఇతర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్ విమర్శలు..
నాగార్జున సాగర్‌లో ఏ అనుమతి లేకుండా సొరంగం తవ్వి నీళ్ల దోపిడీకి ఏపీ ప్రభుత్వం పాల్పడుతోందని, అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దనిద్ర పోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాగునీటి పథకం పేరు చెప్పి సాగునీటిని కూడా ఎత్తుకుపోతున్నారని, 90 టీఎంసీల నీళ్లని తీసుకుపోడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే మంత్రులు,ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి ఏమో హైదరాబాద్‌లో నీళ్లు లేవు స్నానం చేయొద్దని, బండ్లు కడగొద్దని ఉపదేశాలు ఇస్తున్నాడని, నీటిపారుదల శాఖ మంత్రి ఏమో తాగునీటికి ఇబ్బందే లేదని చెప్తున్నాడని గుర్తుచేశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని ప్రశ్నించారు. కాగా, హైదరాబాద్‌లో ఒక అక్టోబర్ నెలలో రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్ చేశారని, మరి దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగారు.
