AP: హరీశ్ చెప్పినదానికి కౌంటర్ ఇచ్చిన జగన్ ! జగన్ రాయసీమ లిఫ్ట్ పై ఏమన్నారంటే
AP: రాయలసీమ లిఫ్ట్ స్కీం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ రగడపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ హయాంలోనే కేఆర్ఎంబీకి లేఖలు రాసి, రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నామని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ చేసిన నేపథ్యంలో, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అసలు నిజాలను పక్కదారి పట్టిస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న రాజకీయ స్నేహం కోసమే మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు.తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం ఎలాంటి కొత్త ప్రాజెక్టు కాదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పథకానికి అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, కొత్త రిజర్వాయర్లు గానీ, అదనపు ఆయకట్టు గానీ లేవని వివరించారు. కరువు పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించిన కృష్ణా నీటిని, అదే పోతిరెడ్డిపాడు కాల్వల ద్వారా సమర్థవంతంగా వాడుకోవడానికి తెచ్చిన ఒక ‘ఇన్సూరెన్స్ స్కీం’ లాంటిదే ఈ పథకమని ఆయన చెప్పుకొచ్చారు.
