AP: రాయలసీమ లిఫ్ట్ స్కీం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ రగడపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ హయాంలోనే కేఆర్ఎంబీకి లేఖలు రాసి, రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నామని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ చేసిన నేపథ్యంలో, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అసలు నిజాలను పక్కదారి పట్టిస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న రాజకీయ స్నేహం కోసమే మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు.
అది కొత్త ప్రాజెక్టు కాదు.. కేవలం ఇన్సూరెన్స్ స్కీం మాత్రమే: జగన్
తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం ఎలాంటి కొత్త ప్రాజెక్టు కాదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పథకానికి అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, కొత్త రిజర్వాయర్లు గానీ, అదనపు ఆయకట్టు గానీ లేవని వివరించారు. కరువు పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించిన కృష్ణా నీటిని, అదే పోతిరెడ్డిపాడు కాల్వల ద్వారా సమర్థవంతంగా వాడుకోవడానికి తెచ్చిన ఒక ‘ఇన్సూరెన్స్ స్కీం’ లాంటిదే ఈ పథకమని ఆయన చెప్పుకొచ్చారు.
880 అడుగులు దాటితేనే నీళ్లు.. లేదంటే కష్టమే
శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం లెక్కలను ప్రస్తావిస్తూ జగన్ పలు అంశాలను వివరించారు. గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది నుంచి ఏపీకి వచ్చే నీళ్లు తగ్గిపోతున్నాయని, పైనుంచి నీళ్లు రాకపోవడానికి తోడు వచ్చిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి పేరుతో కిందకు వదిలేస్తోందని ఆయన ఆరోపించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తిస్థాయిలో (44 వేల క్యూసెక్కులు) నీళ్లు పారాలంటే రిజర్వాయర్ నీటిమట్టం కనీసం 880 అడుగుల పైన ఉండాలని తెలిపారు. ఒకవేళ నీటిమట్టం 854 అడుగుల కంటే కిందకు పడిపోతే అసలు నీళ్లే పంపలేని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేలా పాలమూరు-రంగారెడ్డి (రోజుకు 1.5 టీఎంసీలు), డిండి (0.5 టీఎంసీ), కల్వకుర్తి (0.4 టీఎంసీ), ఎస్ఎల్బీసీ (0.5 టీఎంసీ) ప్రాజెక్టుల ద్వారా రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంతో ముందుకెళ్తోందని జగన్ తెలిపారు.
చంద్రబాబు పనులను ఆపేశారంటూ విమర్శలు
పోతిరెడ్డిపాడు ద్వారా నేరుగా నీళ్లు తీసుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేసి, అదే కాల్వ ద్వారా పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ స్కీం ఉద్దేశమని జగన్ చెప్పారు. అయితే, దాదాపుగా పూర్తయిన ఈ పనులను చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎక్కడ తనకు పేరు వస్తుందోననే కారణంతో ఆపేశారని ఆరోపించారు. ఈ పథకం అవసరాన్ని గట్టిగా వినిపించాల్సింది పోయి, రాజకీయాల కోసం బలిపెట్టి రాయలసీమ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
ప్రతిపక్షాల భిన్న వాదనలు
మరోవైపు, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారని, రాయలసీమ లిఫ్ట్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. అటు తెలంగాణలోని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సైతం తమ రాష్ట్ర నీటి వాటాకు నష్టం జరుగుతుందనే కారణంతో ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి.
