జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కొందరు కుట్ర చేసినట్టు తెలిసింది. నిందితుల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నట్టు సమాచారం.అయితే, ఈ హత్య కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్టు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ, స్వరాజ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్, ఫయాజ్ ఖాన్, బోరబండ, పద్మావతి నగర్‌కు చెందిన దేవర రాజా, బోరబండ సైట్-3 నివాసి అయిన సయ్యద్ హాదీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర పన్నారు. ఇమ్రాన్ ఖాన్, అతడి సోదరుడు ఫయాజ్ ఖాన్.. నెల రోజుల కిందట మహ్మద్ కాషిఫ్ మిస్బా, షేక్ నవాజ్‌లను సంప్రదించినట్టు తెలిసింది. బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేయడానికి రూ.25 లక్షల వరకు సుపారీ ఆఫర్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
రూ.5 లక్షల అడ్వాన్స్..
మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు రూ.5 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో బాబా ఫసియుద్దీన్ నివాసం చుట్టుపక్కల రెక్కీ నిర్వహించారు. ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని తలపెట్టేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు బాబా ఫసియుద్దీన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో బోరబండ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇమ్రాన్ ఖాన్, అతడి సోదరుడు ఫయాజ్ ఖాన్, డి.రాజు, మిగతావారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు.
హత్య కుట్ర కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దీని వెనుక ఉన్న సూత్రధారులు గురించి ఆరా తీసినట్టు సమాచారం. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఫిర్యాదుదారుడు, సాక్షుల వాంగ్మూలాలను వెంటనే రికార్డు చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించారు. ప్రాణహాని ఉన్నందున బాధితుడికి అవసరమైన భద్రతా చర్యలను కల్పించారు. కేసు నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ సమయంలో నిందితులు ఉపయోగించిన రెండు కత్తులను, అలాగే కుట్ర సమయంలో సంభాషణల కోసం వినియోగించిన 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్టు సమాచారం.
