Sukumar: ఓడిన లెక్కల మాస్టారు..అల్లు అరవింద్(Allu Aravind)కి లక్ష రూపాయల చెక్..అవును...ఈ పరిణామం తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. సినిమా తీసిన దర్శకులే సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఆ సినిమా తన హృదయాన్ని ఎంతగా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో ఒక తార సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న సుకుమార్(Sukumar) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) వేసిన సరదా పందెంలో ఓడి లక్ష రూపాయల చెక్‌ని ఇచ్చాడట.
కుటుంబ కథ-ఫీమేల్ సెంట్రిక్ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడం ఒక ఎత్తు.. ఒక స్టార్ డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమాను చూసి కన్నీళ్లు ఆపుకోలేక పందెంలో ఓడిపోవడం మరో ఎత్తు. తాజాగా, టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మధ్య జరిగిన ఓ సరదా పందెం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ పందెంలో సుకుమార్ ఓడిపోవడంతో అనుకున్న ప్రకారం లక్ష రూపాయల చెక్ రాసిచ్చారు.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా విషయంలోనే సుకుమార్-అరవింద్ మధ్య ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ఎమోషనల్‌గా అభిమానులను, ప్రేక్షకులను ఎంతగా కదిలిస్తుందో తెలుసనే నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు సుకుమార్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు.
కోటి రూపాయల ఛాలెంజ్..
‘ఆకాశంలో ఒక తార’ మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే దర్శకుడు సుకుమార్‌కు కోటి రూపాయలు ఇస్తానని నిర్మాత అల్లు అరవింద్ సవాల్ విసిరారట. ఒకవేళ మూవీ చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం సుకుమార్ తనకి లక్ష రూపాయలు ఇవ్వాలని పందెం కట్టారు.
ఈ ఛాలెంజ్‌ను తీసుకున్న సుకుమార్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూశారు. అయితే, ఈ సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలకు ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా ఆగలేకపోయారు. దీంతో, అల్లు అరవింద్‌తో కట్టిన పందెంలో ఓడిపోయారు. అనుకున్న మాట ప్రకారం అల్లు అరవింద్ పేరు మీద లక్ష రూపాయల చెక్ రాసిచ్చారు సుకుమార్. అంతేకాదు, లక్ష రూపాయల చెక్ ఫొటోను సుకుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఎంత ఖరీదైన రికమండేషన్ సార్ ఇది’ అంటూ.. సరదాగా కామెంట్ పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.
