బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' (Akvan) తుపాను తన దిశను మార్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను ముప్పు కొంతమేర తప్పినట్లే కనిపిస్తోంది. తొలుత మచిలీపట్నం-చెన్నై మధ్య, ఆ తర్వాత కాకినాడ-విశాఖపట్నం సమీపంలో తీరం దాటుతుందని భావించిన ఈ తుపాను, తాజాగా దక్షిణ ఒడిశా తీరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రభావం వల్లే తుపాను గమనం మారిందని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు వివరించారు.
మొదటి నుంచి గంటకు 3 నుంచి 9 కిలోమీటర్ల అత్యంత నెమ్మది వేగంతో కదులుతున్న అక్వాన్ సముద్రంలోనే కొంత బలహీనపడిందని, దక్షిణ ఒడిశాతో పాటు కోల్‌కతా, బంగ్లాదేశ్ తీరాల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అక్వాన్, నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్లు, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
గురువారం అర్ధరాత్రి వరకు తీవ్ర తుపానుగానే కొనసాగి, శుక్రవారం మధ్యాహ్నానికి సాధారణ తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ గమనంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటే శ్రీకాకుళం-పూరీ మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను నేరుగా ఏపీ తీరాన్ని తాకకపోయినప్పటికీ, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
అలాగే నవంబర్ 20వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తుపాను గమనం పూర్తిగా స్పష్టమయ్యేంత వరకు తీరప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.
