Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల హామీలు, పాలనా వైఫల్యాల చుట్టూ సాగాల్సిన సమరం ఒక్కసారిగా ఆధ్యాత్మిక అస్తిత్వ ఘర్షణగా రూపాంతరం చెందింది. ఇప్పటిదాకా హిందూత్వ అజెండాతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.
ఏకంగా "శ్రీరాముడు సంపన్నుల దేవుడైతే, పరమేశ్వరుడు పేదల దేవుడు" అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాషాయ శ్రేణుల్లో అగ్గి రాజేశాయి. దక్షిణాది వాసులంతా ద్రవిడులని, శివారాధకులని చెబుతూ.. బీజేపీపై ఆయన ఎక్కుపెట్టిన ఈ రాజకీయ అస్త్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ దుమారం రేపుతోంది.
"రాముడిని హైజాక్ చేశారు.."
బీజేపీ రామనామ జపానికి చెక్ పెట్టే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "శ్రీరాముడిని బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం పూర్తిగా హైజాక్ చేసింది. ఉత్తరాది వాసులు రామభక్తులు కావచ్చు.. కానీ దక్షిణాది వాసులమైన మేమంతా పరమశివుడిని నమ్ముకున్న ద్రవిడులం. రాముడు ఉన్నోళ్ల పక్షమైతే, శివుడు సర్వసంగ పరిత్యాగిగా పేద ప్రజల హృదయాల్లో కొలువైన దేవుడు. కేవలం 'జై శ్రీరామ్' అనే నినాదంతోనే ఓట్లు దండుకోవాలని చూసే బీజేపీ నేతలు, ప్రధాని మోడీ ఎప్పుడైనా గొంతు విప్పి 'హర హర మహాదేవ' అని ఎందుకు పలకరు?" అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతీయ భావోద్వేగాలను, దైవ భక్తిని ముడిపెడుతూ రేవంత్ సంధించిన ఈ ప్రశ్నలు కాషాయ శ్రేణుల్లో దుమారం రేపాయి.
"ఇది బ్రిటీష్ బుద్ధి.. జిహాదీల అజెండా": కాషాయ దళం
రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిందూ దేవుళ్ల మధ్య కూడా వర్గ వైషమ్యాలు రగిల్చేందుకు కాంగ్రెస్ దిగజారిందని రాష్ట్ర కాషాయ దళాధిపతి, సీనియర్ నేత ఎన్.రామచంద్రరావు మండిపడ్డారు. "దేశాన్ని కులమతాల ప్రాతిపదికన ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఇప్పుడు ఏకంగా రాముడు, శివుడి మధ్య అంతరాలు సృష్టించి హిందూ సమాజ ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారు.
హిందువులకు హరిహరులు ఇద్దరూ సమానమే. ఆర్య-ద్రవిడ సిద్ధాంతం అనేది భారతదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి తెల్లదొరలు సృష్టించిన తప్పుడు ప్రచారం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నదంతా అఖండ భారతమే. హిందూ సమాజాన్ని బలహీనపరిచేందుకు యత్నిస్తున్న జిహాదీ శక్తుల చేతిలో రేవంత్ రెడ్డి పావుగా మారారు" అని రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగారు.
"గెలవడానికి దేవుళ్లపై ఒట్లు.. గెలిచాక దేవుళ్ల మధ్య చిచ్చా?": బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమాల ద్వారా రేవంత్ తీరును ఎండగట్టారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లకు వర్గ విభేదాలు అంటగట్టడం దారుణమని ధ్వజమెత్తారు. "కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే భావజాలంతో నడిచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పవిత్రమైన దైవాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం కోసం, అసాధ్యమైన హామీలను నమ్మించడం కోసం ఇదే దేవుళ్ల ఎదుట ప్రమాణాలు చేశారు. తీరా గద్దెనెక్కాక అదే దేవుళ్లను ఉత్తర-దక్షిణ అని, ధనిక-పేద అని విభజిస్తారా? సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ ధర్మ విశ్వాసాలను కించపరచడం మానుకోవాలి" అని సంజయ్ హెచ్చరించారు.
వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ.. ఎటు దారితీస్తుందో
బీజేపీ ఎజెండా అయిన 'జై శ్రీరామ్' నినాదాన్ని నేరుగా వ్యతిరేకించకుండా, దానికి ప్రత్యామ్నాయంగా స్థానిక 'శివారాధన'ను, ద్రవిడ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా హిందూత్వ కార్డుతో బీజేపీ బలపడకుండా అడ్డుకట్ట వేయవచ్చనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తుందని అంటున్నారు. అయితే దేవుళ్లను పేద-ధనిక వర్గాలుగా విభజించడం ద్వారా రేవంత్ రెడ్డి స్వయంగా భస్మాసుర హస్తాన్ని కొనితెచ్చుకున్నారా లేక బీజేపీ రామబాణానికి పాశుపతాస్త్రంతో బ్రేక్ వేశారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.


