ఏప్రిల్ ఓటమి నుంచి నవంబర్ కొత్త లెక్కల వరకు..
360 ఓట్ల కోసం ఎన్డీఏ భారీ స్కెచ్
ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష
మోదీ వ్యూహం ఫలిస్తుందా?
రాహుల్ మంత్రం సక్సెస్ అవుతుందా?
స్వేచ్ఛ న్యూస్, న్యూఢిల్లీ
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ పార్లమెంట్‌లో బిల్లులు గట్టెక్కుతాయా? అవసరమైన ప్రత్యేక మెజారిటీని ఎన్డీఏ సాధించగలదా? లేక ఏప్రిల్‌లో ఎదురైన పరాజయం మరోసారి రిపీట్ అవుతుందా..? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన చర్చ. ఈసారి కేంద్రం ముందుకు తెస్తున్న ప్రతిపాదనకు రాజకీయంగా కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు షరతులతో మద్దతు ఇచ్చే సంకేతాలు ఇస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం డీలిమిటేషన్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఏప్రిల్‌లో ఏం జరిగింది?
2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 528 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో మూడింట రెండొంతుల మెజారిటీకి 352 ఓట్లు అవసరం. కానీ బిల్లుకు 298 ఓట్లు మాత్రమే రావడంతో అది వీగిపోయింది. ఇప్పుడు కేంద్రం కొత్త ప్రతిపాదనలతో మళ్లీ ముందుకొస్తోంది. ఈసారి అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించడం వంటి మార్పులు చేసింది.
డీఎంకే మద్దతు దక్కుతుందా?
ఈ బిల్లులో అత్యంత కీలకంగా మారిన పార్టీ డీఎంకే. లోక్‌సభలో ఆ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని పార్టీ అధినేత స్టాలిన్ స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఈ హామీని చట్టంలో స్పష్టంగా పొందుపరిస్తే బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీఎంకే నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది. కాంగ్రెస్ కూడా డీఎంకేతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది.
పవార్ ఎన్సీపీ నుంచి కీలక ప్రకటన
ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బిల్లుకు షరతులతో మద్దతు ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలను ఒకే విధంగా 50 శాతం పెంచే హామీ ఉండాలని ఆ పార్టీ కోరుతోంది. ఈ పార్టీకి లోక్‌సభలో 8 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో కూడా ఒక సభ్యుడు ఉన్నారు. ఈ మద్దతు ప్రకటన రాజకీయ లెక్కల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీ పెట్టిన షరతులు బిల్లులో ఎలా ప్రతిబింబిస్తాయన్నది కీలకం. వైఎస్సార్‌సీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలున్నారు. ఆ పార్టీ వైఖరి కూడా నెంబర్ గేమ్ లో ప్రభావం చూపవచ్చు.
కాంగ్రెస్ వ్యూహం ఏంటి?
మరోవైపు కాంగ్రెస్ ఈ బిల్లులను వేర్వేరుగా చూడాలని కోరుతోంది. మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతు ఇస్తున్నామని, కానీ దాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం అవసరం లేదని వాదిస్తోంది. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి 2029 నుంచే అమలు చేయవచ్చన్నది కాంగ్రెస్ ప్రతిపాదన. రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా చట్టపరమైన హామీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి పార్టీలతో పాటు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ వంటి కూటమిలో లేని పార్టీలను కూడా ఆహ్వానించారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వైఖరితో నిలబడతాయా? మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తూనే డీలిమిటేషన్‌పై అభ్యంతరాలను ఎలా వ్యక్తం చేస్తాయి? అన్నది ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాజ్యసభలోనూ ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి
ఈ బిల్లుల ఆమోదానికి లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ప్రత్యేక మెజారిటీ అవసరం. రాజ్యాంగ సవరణ బిల్లును రెండు సభలూ విడివిడిగా ఆమోదించాలి. ఒక సభలో బిల్లు ఓడిపోతే ఉమ్మడి సమావేశం ద్వారా గట్టెక్కించే అవకాశం లేదు. అందుకే ఎన్డీఏకు లోక్‌సభలో మాత్రమే కాదు, రాజ్యసభలోనూ అవసరమైన మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రాంతీయ పార్టీల వైఖరి ఇక్కడ కూడా కీలకంగా మారుతుంది.
ఈసారి రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి?
ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన కొన్ని పార్టీలు ఇప్పుడు షరతులతో మద్దతు ప్రకటిస్తున్నాయి. డీఎంకే తన రాష్ట్ర ప్రయోజనాలపై హామీ కోరుతోంది. పవార్ ఎన్సీపీ.. సీట్ల పెంపుపై స్పష్టతతో మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం బిల్లుల నిర్మాణాన్నే ప్రశ్నిస్తోంది. అంటే ఈసారి చర్చ కేవలం బిల్లుకు అనుకూలమా, వ్యతిరేకమా అన్నదానికే పరిమితం కాదు. మహిళా రిజర్వేషన్ అమలు, రాష్ట్రాల ప్రాతినిధ్యం, సీట్ల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ అధికారాలు.. ఇలా ప్రతి అంశంపైనా రాజకీయ పార్టీల మధ్య చర్చ జరగనుంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాల్లో ఈ అంశాలు ముందుకు రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనకు అవసరమైన మద్దతు లభిస్తుందా? ప్రతిపక్షాలు ఒకే వ్యూహంతో నిలబడతాయా? ప్రాంతీయ పార్టీల షరతులకు కేంద్రం అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలకు పార్లమెంట్‌లోనే సమాధానం దొరకనుంది.
