అమిత్ షా సవాల్.. రాహుల్ గాంధీకి కొత్త టెన్షన్
సర్.. పోరాటానికి చెక్ పెట్టేందుకే డీలిమిటేషన్ అస్త్రమా?
మహిళా రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు రాజకీయ చిక్కులు
డీఎంకే, ఎన్సీపీ మద్దతుపై ఎన్డీయే ఆశలు
మోదీ సర్కార్ వ్యూహంలో రెండు రాజకీయ లక్ష్యాలు?
సర్ పై దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తోంది కాంగ్రెస్. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుంటోంది. రాహుల్ గాంధీ స్వయంగా ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం అనూహ్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు సిద్ధమైంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లే ఈ సమావేశాల వెనుక అసలు అజెండాగా కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం మహిళా రిజర్వేషన్ల అమలు కోసమేనా? లేక ఎస్‌ఐఆర్ అంశంతో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తున్న సమయంలో ఆ పార్టీని మరో రాజకీయ పోరాటంలోకి లాగేందుకు మోదీ సర్కార్ వేసిన వ్యూహమా? అమిత్ షా వ్యాఖ్యలు, పార్లమెంటులో ఎన్డీయే సంఖ్యాబలం కోసం జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అనేక రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయి.
రాహుల్‌కు అమిత్ షా సవాల్.. అసలు టార్గెట్ కాంగ్రెస్‌నేనా?
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుంటోందంటూ ఆయన నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది బీజేపీ, ప్రధాని మోదీ సంకల్పమని.. ఎవరూ అడ్డుకోలేరని సవాల్ చేశారు.
ఈ వ్యాఖ్యల్లో రాజకీయ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలన్నది బీజేపీ ప్రయత్నంగా కనిపిస్తోంది. 2023లోనే చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కానీ కేంద్రం మాత్రం డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
అంటే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే అవకాశం బీజేపీకి లభిస్తుంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతిస్తే డీలిమిటేషన్ విషయంలో కేంద్రంతో కలిసి రావాల్సి ఉంటుంది. వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారన్న రాజకీయ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చే అంశం.
సర్ ఉద్యమం నుంచి కాంగ్రెస్ ను వెనక్కి లాగేందుకేనా..?
ప్రస్తుతం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా SIR.. అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయని ఆరోపిస్తోంది. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ పోరాటం ద్వారా ఎన్నికల సంఘం విశ్వసనీయత, ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకురావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామం. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నిర్మిస్తున్న రాజకీయ పోరాటాన్ని పక్కకు నెట్టి, మహిళా రిజర్వేషన్లు, పార్లమెంటు స్థానాల పెంపుపై చర్చను కేంద్రం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
డీలిమిటేషన్‌తో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు!
కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రణాళిక ప్రకారం లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే అవకాశం ఉంది. అందులో మహిళలకు సుమారు 283 స్థానాలు రిజర్వ్ చేయాలన్న ఆలోచన ఉంది. దీనితో పాటు నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే అధికారాలతో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుత స్థానాలకు 50 శాతం చొప్పున పెంపు కల్పించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉందన్న సంకేతాలిస్తోంది. ఏప్రిల్‌లో అమిత్ షా కూడా ఈ హామీ ఇచ్చారు. కానీ అది అప్పటి బిల్లు ముసాయిదాలో స్పష్టంగా లేదు. ఈసారి బిల్లులో ఆ హామీ ఉంటుందా లేదా అన్నదే కీలకం.
ఈ విషయంలో కాంగ్రెస్‌కు మరో సమస్య ఉంది. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూనే డీలిమిటేషన్‌ను వ్యతిరేకించాలి. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలి. ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేయడం కాంగ్రెస్‌కు రాజకీయంగా సవాలే.
మోదీ వ్యూహంలో రెండు లక్ష్యాలున్నాయా?
కేంద్రం ముందున్నది రెండు రాజకీయ లక్ష్యాలుగా కనిపిస్తోంది. మొదటిది.. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేస్తున్న ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్లడం. రెండోది.. డీలిమిటేషన్ ద్వారా దేశ రాజకీయ వ్యవస్థలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం. అదే సమయంలో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సమాంతరంగా మరో పెద్ద రాజకీయ చర్చను తెరపైకి తీసుకురావడం కూడా బీజేపీకి ప్రయోజనకరంగా మారవచ్చు. కాంగ్రెస్ ఒకవైపు ఓటర్ల జాబితాల అంశంపై పోరాడుతుంటే.. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై తన వైఖరిని సమర్థించుకోవాల్సి వస్తోంది.
అమిత్ షా రాహుల్ గాంధీకి విసిరిన సవాల్, వెంటనే పార్లమెంటు సమావేశాల నిర్ణయం, ఎన్డీయే మద్దతు కూడగట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. ఇవన్నీ ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగమా అన్న చర్చకు తావిస్తున్నాయి.
మరి ఈసారి మోదీ సర్కార్ డీలిమిటేషన్ బిల్లును గట్టెక్కిస్తుందా? మహిళా రిజర్వేషన్లను రాజకీయంగా కాంగ్రెస్‌పై పైచేయి సాధించే అస్త్రంగా మార్చుకుంటుందా? లేక దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఐక్యత మరోసారి కేంద్రం ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తాయా? నవంబర్ 30 నుంచి పార్లమెంటులో జరగబోయే పరిణామాలు ఈ రాజకీయ వ్యూహానికి అసలు పరీక్షగా మారనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొద్ది రోజులు సర్.. పోరాటాన్ని పక్కన పెట్టాల్సి రావచ్చు. లేదంటే.. ఢిల్లీలో జరగబోయే పరిణామాలు.. ఆ పార్టీకి చాలా ఇబ్బందులు తెచ్చే అవకాశముంది.
