అంతర్జాతీయం

ట్రంప్ టార్గెట్ లో భారత్.. టారిఫ్ లు పెంచడం వెనుక వ్యూహమేంటి..? మేక్ ఇన్ ఇండియాపై గురి

భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం. విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు. కానీ ఇప్పుడు ఈ విధానాలపైనే అమెరికా గురిపెట్టింది. భారత్‌లో తయారీ సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలే అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగిస్తున్నాయంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త యుద్ధానికి తెరతీసింది.

మేక్ ఇన్ ఇండియాపై అమెరికా గురి

భారత్‌పై 25 శాతం టారిఫ్‌ల ప్రతిపాదన

ట్రేడ్ డీల్‌తో 17 శాతానికి తగ్గే ఛాన్స్

వియత్నాంతో పోటీలో భారత్‌కు కొత్త అవకాశం

ట్రంప్ ఒత్తిడికి మోదీ సర్కార్ కౌంటర్ వ్యూహం

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యం. విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, పీఎల్ఐ వంటి పథకాలు. కానీ ఇప్పుడు ఈ విధానాలపైనే అమెరికా గురిపెట్టింది. భారత్‌లో తయారీ సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలే అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగిస్తున్నాయంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త యుద్ధానికి తెరతీసింది. ఏకంగా 25 శాతం వరకు అదనపు టారిఫ్‌లు విధించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే ఈ రేటును 17 శాతానికి తగ్గించే అవకాశం కూడా చూపించింది. అసలు భారత్ తయారీ రంగం అమెరికాకు ఎందుకు సమస్యగా మారింది? ట్రంప్ వ్యూహం వెనుక అసలు లక్ష్యమేంటి? ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

మనం.. అమెరికాకు ఎందుకు నచ్చడం లేదు?

ప్రపంచ తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భారత్ ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం, దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను విస్తరించడం.. ఇవే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు. ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పీఎల్ఐ వంటి పథకాలను అమలు చేస్తోంది.

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా కూడా చాలాకాలంగా చెబుతోంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో ప్రత్యామ్నాయ దేశాల అవసరాన్ని గుర్తించింది. అలాంటి సమయంలో భారత్ తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం అమెరికాకు అనుకూలంగా ఉండాలి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వైఖరి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. భారత్‌లో ప్రభుత్వ ప్రోత్సాహకాలతో తయారీ సామర్థ్యం అవసరానికి మించి పెరుగుతోందని, దేశీయ మార్కెట్‌లో అమ్ముడుపోని ఉత్పత్తులు అమెరికా సహా ఇతర దేశాలకు చేరి అక్కడి కంపెనీలకు పోటీగా మారుతున్నాయనేది వాషింగ్టన్ ఆరోపణ.

ఈ వాదన ఆధారంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్‌టీఆర్ నవంబర్ 25న కీలక నిర్ణయం ప్రకటించింది. భారత్ సహా 14 ఆర్థిక వ్యవస్థల తయారీ, ఉత్పత్తి విధానాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయని నిర్ధారించింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికే వర్తించే కొన్ని సెక్షన్ 301 సుంకాలకు అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌లు విధించాలని ప్రతిపాదించింది. కొన్ని ఉత్పత్తులకు మినహాయింపులు కూడా ఉన్నాయి.

25 శాతం టారిఫ్.. డీల్ కుదిరితే 17 శాతమే!

ఇక్కడే ట్రంప్ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే ప్రతిపాదిత అదనపు టారిఫ్‌ను 17 శాతానికి సర్దుబాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. అంటే ఒకవైపు 25 శాతం టారిఫ్‌లతో ఒత్తిడి.. మరోవైపు ఒప్పందానికి వస్తే కొంత ఊరట. ఇది కేవలం దిగుమతి సుంకాల వ్యవహారం మాత్రమే కాదు. భారత్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై ఒత్తిడి పెంచే వ్యూహంగా కూడా కనిపిస్తోంది.

అయితే ఇవి ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చిన టారిఫ్‌లు కావు. యూఎస్‌టీఆర్ ప్రతిపాదించిన చర్యలు మాత్రమే. వీటిపై 2027 జనవరి 5 వరకు అభిప్రాయాలు స్వీకరించనుంది. జనవరి 25న బహిరంగ విచారణ కూడా నిర్వహించనుంది. ఆ తర్వాతే తుది నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మేక్ ఇన్ ఇండియాపై అమెరికా అభ్యంతరం ఏంటి?

అమెరికా వాదనలో కీలకమైన పదం 'స్ట్రక్చరల్ ఎక్సెస్ కెపాసిటీ'. అంటే మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం. ఉదాహరణకు ఒక కంపెనీ ఏడాదికి 100 యూనిట్లు తయారు చేయగలదు అనుకుందాం. కానీ దేశీయ మార్కెట్ అవసరం 60 యూనిట్లే. మిగిలిన 40 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో తప్పేమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇలాగే వ్యాపారం చేస్తుంటాయి.

కానీ ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలతో కంపెనీలు మార్కెట్ డిమాండ్‌కు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటే సమస్య వస్తుందని అమెరికా వాదిస్తోంది. అలా తయారైన అదనపు ఉత్పత్తులను తక్కువ ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మితే అమెరికా కంపెనీలు పోటీని తట్టుకోలేవని చెబుతోంది. ఇదే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, పీఎల్ఐ పథకాలపై అమెరికా అభ్యంతరాలకు ప్రధాన కారణం.

మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీని పెంచడం, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పీఎల్ఐ ద్వారా ఎక్కువ ఉత్పత్తి చేసే కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం.. ఇవన్నీ భారత పారిశ్రామిక విధానంలో కీలకమైన భాగాలు. కానీ అమెరికా దృష్టిలో ఇవే ప్రభుత్వ జోక్యంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని కృత్రిమంగా పెంచే చర్యలు.

అంతేకాదు, విదేశీ మార్కెట్లలో భారత ఉత్పత్తులను ప్రోత్సహించే ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వంటి సంస్థల కార్యకలాపాలను కూడా అమెరికా తన విచారణలో ప్రస్తావించింది. అయితే భారత్ మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు. తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం ప్రతి దేశానికి ఉన్న హక్కు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పరిశ్రమలు అభివృద్ధి చెందడం తప్పెలా అవుతుందన్నది భారత వాదన.

సెక్షన్ 301.. ట్రంప్ చేతిలో మరో అస్త్రం!

అమెరికా ఈసారి ఉపయోగిస్తున్నది సెక్షన్ 301. ఇది 1974 నాటి అమెరికా ట్రేడ్ యాక్ట్‌లో ఉన్న నిబంధన. ఇతర దేశాల ప్రభుత్వ విధానాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు అన్యాయం చేస్తున్నాయని భావిస్తే వాటిపై విచారణ జరిపి ప్రతీకార చర్యలు తీసుకునేందుకు ఈ నిబంధన అమెరికాకు అధికారం ఇస్తుంది.

2026 మార్చి 11న అమెరికా 16 ఆర్థిక వ్యవస్థలపై ఈ విచారణ ప్రారంభించింది. నవంబర్ 25న భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, తైవాన్, స్విట్జర్లాండ్, యూరోపియన్ యూనియన్ సహా 14 ఆర్థిక వ్యవస్థలపై నిర్ణయాలు ప్రకటించింది. అంటే ఇది కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న చర్య కాదు. ప్రపంచ తయారీ రంగంలో కీలకంగా ఉన్న అనేక దేశాలపై అమెరికా ఒకేసారి ఒత్తిడి పెంచుతోంది.

ఇదే సమయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గతంలో తీసుకొచ్చిన లిబరేషన్ డే టారిఫ్ విధానానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సెక్షన్ 301 ద్వారా మరో చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించుకోవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

వియత్నాంపై 35 శాతం.. భారత్‌కు మాత్రం 25 శాతం!

ఈ పరిణామాల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. అమెరికా ప్రతిపాదించిన టారిఫ్‌లను పరిశీలిస్తే భారత్ కంటే కొన్ని పోటీ దేశాలపై ఎక్కువ సుంకాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలపై 18 శాతం వరకు అదనపు టారిఫ్‌లను ప్రతిపాదించగా, వియత్నాం విషయంలో ఏకంగా 35 శాతం వరకు ప్రతిపాదించింది. భారత్‌కు మాత్రం 25 శాతం వరకు సుంకం ప్రతిపాదించింది. అయితే వియత్నాంతో ఒప్పందం కుదిరితే ఆ రేటును 20 శాతానికి, భారత్‌తో ఒప్పందం కుదిరితే 17 శాతానికి సర్దుబాటు చేసే అవకాశాన్ని అమెరికా పేర్కొంది.

ఇది భారత్‌కు ఒకరకంగా ప్రయోజనంగా మారవచ్చు. ఎందుకంటే వియత్నాం ఇప్పటికే ప్రపంచ తయారీ రంగంలో కీలక కేంద్రంగా ఎదిగింది. చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను తరలించాలనుకునే అనేక అంతర్జాతీయ కంపెనీలు వియత్నాంను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నాయి. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్, సోలార్ ఉత్పత్తుల వంటి రంగాల్లో భారత్ కూడా వియత్నాంతో పోటీ పడుతోంది. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు తక్కువ టారిఫ్‌లు వర్తిస్తే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించవచ్చు.

కానీ భారత్‌కు 17 శాతం రేటు రావడం అనేది ట్రేడ్ డీల్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, తైవాన్ వంటి దేశాలకు 15 శాతం వరకు, సింగపూర్‌కు 10 శాతం వరకు ప్రతిపాదిత రేట్లు ఉండటంతో భారత్‌కు పూర్తిస్థాయి ప్రయోజనం ఉందని చెప్పలేం.

ట్రేడ్ డీల్ కోసం భారత్‌పై ఒత్తిడా?

ఈ టారిఫ్‌ల ప్రతిపాదన వెనుక భారత్, అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు కూడా కీలకంగా కనిపిస్తున్నాయి. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులకు భారత మార్కెట్‌లో మరింత ప్రవేశం కోరుతోంది. ముఖ్యంగా డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, సోయాబీన్ ఆయిల్, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వైన్ వంటి ఉత్పత్తులపై మార్కెట్ యాక్సెస్ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి.

అమెరికా నుంచి వచ్చే మెడికల్ డివైజెస్, ఐసీటీ ఉత్పత్తుల దిగుమతులపై ఉన్న అడ్డంకులను తగ్గించాలని వాషింగ్టన్ కోరుతోంది. అమెరికా అభివృద్ధి చేసిన లేదా అంతర్జాతీయ ప్రమాణాలను కొన్ని ఉత్పత్తులకు అంగీకరించాలని కూడా ఒత్తిడి చేస్తోంది.

మరో కీలక అంశం అమెరికా నుంచి కొనుగోళ్లు. రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధనం, విమానాలు, విమాన విడిభాగాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలన్న భారత్ ఉద్దేశాన్ని కూడా ఇరు దేశాల జాయింట్ స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. అంటే అమెరికాకు భారత్‌లో పెద్ద మార్కెట్ కావాలి. భారత్‌కు అమెరికా మార్కెట్‌లో మరిన్ని అవకాశాలు కావాలి. ఈ రెండు ప్రయోజనాల మధ్యే ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. తాజా టారిఫ్ ప్రతిపాదనలతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

భారత్ ముందున్న మార్గమేంటి?

ట్రంప్ తాజా నిర్ణయం భారత్‌కు కేవలం టారిఫ్‌ల రూపంలోనే కాకుండా వ్యూహాత్మకంగా కూడా సవాలు విసురుతోంది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య సంబంధాలను దెబ్బతినకుండా చూసుకోవాలి. మరోవైపు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసే విధానాలను వెనక్కి తీసుకునే పరిస్థితి రాకూడదు.

అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడకుండా యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎగుమతి అవకాశాలను పెంచుకోవడం భారత్ ముందున్న మరో మార్గం. ఇప్పటికే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న భారత్‌ను ఇప్పుడు అమెరికా తన వాణిజ్య ప్రయోజనాల కోణంలో చూస్తోంది. ప్రపంచ తయారీ రంగంలో భారత్ ఎదగడం ఒకవైపు.. అదే ఎదుగుదల అమెరికా కంపెనీలకు పోటీగా మారుతోందన్న ట్రంప్ వాదన మరోవైపు.

మరి భారత్ ఈ ఒత్తిడికి తలొగ్గుతుందా? లేక తన తయారీ రంగ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాతో డీల్ కుదుర్చుకుంటుందా? ట్రంప్ విధించిన ఈ కొత్త వాణిజ్య పరీక్షలో మోదీ సర్కార్ ఎలా నెగ్గుకొస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐతే ఇదే సమయంలో మన ట్రేడర్స్ మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను ప్రతిపాదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కారు తీసుకోయే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తర్వాత చదవండి