తెలంగాణ

ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

4 నిమిషాల పఠనం

ప్రభుత్వ అధికారుల పనితీరు, అవినీతిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులుగా మారారని ఆయన బహిరంగంగా ఆరోపించారు.

 ప్రభుత్వ అధికారుల పనితీరు, అవినీతిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులుగా మారారని ఆయన బహిరంగంగా ఆరోపించారు. కొంతమంది అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వల్లే తమ ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వస్తోందని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఆయన నేరుగా ఎండగట్టడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 డబ్బులిస్తేనే ఫైళ్లు కదులుతున్నాయ్..

తన నియోజకవర్గంలో ఎదురైన ఒక ప్రత్యక్ష అనుభవాన్ని ఉదహరిస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఒక సామాన్యుడికి సంబంధించిన న్యాయమైన పనిని పూర్తి చేయాలని తాను స్వయంగా ఓ అధికారికి సిఫారసు చేస్తే ఆ పని చేయలేదని తెలిపారు. కానీ, ఆ వ్యక్తి నేరుగా వెళ్లి సదరు అధికారికి రూ.15వేల లంచం ముట్టజెప్పగానే క్షణాల్లో పని పూర్తి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మాటలకే విలువ లేకుండా పోతోందని, కేవలం డబ్బులు ఇస్తేనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదులుతున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు.

 శ్రుతిమించుతున్న కమీషన్ల దందా

నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలోనూ అధికారుల కమీషన్ల దందా శ్రుతి మించుతోందని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా రోడ్లు వేసే కాంట్రాక్టర్ల నుంచి అధికారులు ఏకంగా 20శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తూ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల వేధింపులు, భారీ కమీషన్ల వసూళ్లకు భయపడి కాంట్రాక్టర్లు పనులు చేయలేక మధ్యలోనే పారిపోతున్నారని, దీనివల్ల నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు.

 గతంలోనూ తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు, పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో ముక్కుసూటిగా మాట్లాడి వార్తల్లో నిలిచిన అనిరుధ్ రెడ్డి, తాజాగా అధికారుల అవినీతిపై చేసిన వ్యాఖ్యలు అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్నాయి. లంచగొండి అధికారులపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

#JadcherlaMLAAnirudhReddy#TelanganaOfficialsCorruption#CongressMLACommentsOnBribery#20PercentCommissionContractors#TelanganaPolitics2026#MahabubnagarNewsTelugu#HydNewsTelugu#BreakingNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి