ఏపీని వణికిస్తున్న మరో తుఫాన్
వరుస తుఫాన్లతో రాష్ట్రం అతలాకుతలం
అక్వాన్ తో విధ్వంసం తప్పదా..?
వానల కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపులు
ఈసారైనా వర్షాలు కురుస్తాయా..?
ఒకే తుఫాన్. రెండు రాష్ట్రాలు. కానీ ఒకచోట తుఫానే వద్దనే పరిస్థితి. మరోచోట ఈ తుఫానైనా వానలు కురిపిస్తుందా అనే ఎదురుచూపు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇది. వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. నవంబర్ నెలలోనే తీర ప్రాంతం తుఫాన్ల ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోకముందే.. అక్వాన్ తుఫాన్ వణికించేస్తోంది. ప్రస్తుతం తుఫాన్ గా కొనసాగుతున్న అక్వాన్.. మరికొద్ది గంటల్లోనే తీవ్ర తుఫాన్ గా, బుధవారం నాటికి అతి తీవ్ర తుఫాన్ గా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 20న ఏపీలో ఈ తుఫాన్ తీరం దాటనుంది.
తీరం దాటేది ఎక్కడ..?
ఐఎండీ అంచనా ప్రకారం.. నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య ఈ తుఫాన్ తీరే దాటే అవకాశముంది. ఆ సమయంలో గాలుల తీవ్రత దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కోస్తాంధ్ర మొత్తం కుండపోత వర్షాలు కురిసే అవకాశముంది. తీర ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా.. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదముంది. పంటలకు భారీ నష్టం తప్పకపోవచ్చు. కొన్నిచోట్ల వరదలు కూడా వస్తాయని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది.
తెలంగాణలో వానలు పడతాయా..?
అక్వాన్ తుఫాన్ పేరు చెబితేనే ఏపీ వణికిపోతోంది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం మరో రకమైన వాతావరణం కనిపిస్తోంది. కనీసం ఈ తుఫానైనా రాష్ట్రంలో వర్షాలు కురిపించాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. మొన్నటి తుఫాన్లతో తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసినా.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సాగు సంగతేమో కానీ.. తాగే నీళ్లకు కూడా కష్టాలు తప్పేలా లేవు.
ఐతే ఐఎండీ అంచనాలు, కొన్ని ప్రైవేట్ వెదర్ ఏజెన్సీల మోడళ్లు.. తెలంగాణలో ఆశలు పుట్టిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటాక.. ఆ మేఘాలు తెలంగాణ వైపు కదిలితే.. మంచి వర్షాలు కురిసే అవకాశముందని కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐతే తుఫాన్ ఎప్పుడైనా దిశ మార్చుకోవచ్చని, కానీ ప్రస్తుతం అది కదులుతున్న పరిస్థితిని గమనిస్తే తెలంగాణలో మంచి వర్షాలే కురిసే అవకాశముందని చెబుతున్నారు. మరికొద్ది గంటల్లో దీనిపై ఇంకా క్లారిటీ రావచ్చు.
ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం చూపే అవకాశముంది. హైదరాబాద్ లో కూడా ఈనెల 21, 22 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశముంది. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం తక్కువే.
ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణపై ఏమాత్రం కనికరించలేదు. గత నెల దాకా ఏపీ పరిస్థితి కూడా ఇదే. ఐతే వరుస తుఫాన్లతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో మంచి వర్షాలే కురిశాయి. అదే సమయంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను శోక సంద్రంలో ముంచాయి తుఫాన్లు. ఇటు తెలంగాణలో మాత్రం తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్వాన్ తుఫాన్ ఏ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


