5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్ విద్యకు మంగళం
ఇంటర్ బోర్డు రద్దు దిశగా సర్కారు అడుగులు వేస్తోందా..?
ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు లాభమా.. నష్టమా..?
కార్పొరేట్ కాలేజీల స్థాయి ఎడ్యుకేషన్ స్కూళ్లలో అందుతుందా..?
ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ పై పెను ప్రభావమే చూపుతోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అమలవుతున్న ఇంటర్మీడియెట్ విధానాన్ని పూర్తిగా తీసేసి.. 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 11న విద్యాశాఖ సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదో తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ మొదటి.. రెండవ సంవత్సరాలు కలిసి ఇంటర్ బోర్డు ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నది సర్కారు ఉద్దేశం. అంటే 9 నుంచి 12వరకు సీనియర్ సెకండరీ విద్యగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నిర్ణయానికి కారణాలేంటి...?
ఈ నిర్ణయానికి ప్రభుత్వం చెబుతున్న కారణం ఒక్కటే. అదే డ్రాపౌట్లు. పదవ తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, ఇంటర్ లో జాయిన్ కావడానికి ఆసక్తి చూపడం లేదనేది ప్రభుత్వ వాదన. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీలు దూరంగా ఉండడం, టెన్త్ పూర్తవగానే వేరే పనుల్లో చేరడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. స్కూల్లోనే ఇంటర్ వరకు చదువు అందిస్తే.. పిల్లలు మధ్యలో మానేయకుండా చూడొచ్చనేది ఆలోచన. ఇదే సమయంలో మరికొన్ని సానుకూల అంశాలను కూడా చెబుతోంది ప్రభుత్వం. ఇంటర్ వరకు స్కూళ్లోనే ఉంటే.. దాదాపుగా అందరూ 12వ తరగతి వరకు చదువుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఏవో కారణాలు చెప్పి టెన్త్ తర్వాత స్కూళ్లు మానేయరనేది వారి వాదన.
అంతేకాదు.. ప్రభుత్వానికి కూడా కొంత భారం తగ్గే అవకాశముంటుంది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డు అనే రెండు వ్యవస్థలు పనిచేయాల్సి వస్తోంది. అదే 12వ తరగతి వరకు ఒకే దగ్గర చదువు అందుబాటులోకి వస్తే.. నిర్వహణ కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ నేర్పించవచ్చని కూడా కొందరు అధికారులు చెబుతున్నారు.
విలీనంపై అభ్యంతరాలు ఎందుకు...?
ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే పనైపోదు. దానిపై పాజిటివ్ గా మాట్లాడేవారు ఉంటారు. వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ఇంటర్మీడియెట్ విలీనం అంశంపై చాలా మంది విద్యావేత్తలు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే... విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. స్కూల్ ఎడ్యేకేషన్ కి, ప్రొఫెషనర్ విద్యకు ఇంటర్ ఒక బేస్ లాంటిదని అంటున్నారు.
MPC, BiPC, CEC, MEC లాంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత కోర్సుల్లో చేరేందుకు ప్రిపేరవుతారని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందితేనే.. విద్యార్థులు ఆలిండియా స్థాయిలో ర్యాంకులు కొట్టగలరనేది విద్యావేత్తల వాదన. ఒకవేళ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ను స్కూల్ విద్యలో కలిపితే.. ఆ స్థాయి విద్యను అందించగలరా అనేది వారి మెయిన్ క్వశ్చన్.
ఇక తల్లిదండ్రుల్లో కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్లోనే ఇంటర్మీడియెట్ చదివితే.. తమ పిల్లలు JEE, NEET, EAPCET లాంటి పరీక్షల్లో సత్తా చాటగలరా అని ప్రశ్నిస్తున్నారు. సిలబస్ ఇదే ఉంటుందా..? లేకపోతే మారుస్తారా అనే దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్ కాలేజీలే ఉండవా..?
ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపితే.. అసలు ఇంటర్ కాలేజీలు ఉంటాయా..? లేక వాటిని మూసేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని స్కూళ్లలో ఇంటర్మీడియెట్ వరకు క్లాసులు చెబితే.. ఇంటర్ కాలేజీల్లో చేరే వారెవరు..? మరి ఇంటర్మీడియెట్ కాలేజీల యాజమాన్యాలు దీనికి ఓకే చెబుతాయా..? ఎందుకంటే.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల నెట్ వర్క్ చాలా పెద్దది. ఇప్పటికే ఆయా యాజమాన్యాలు బోలెడంత పెట్టుబడి పెట్టి ఉంటాయి. సెడన్ గా వాటిని మూసేస్తే వారి పరిస్థితేంటి..? కార్పొరేట్ కాలేజీలు పెద్ద బిజినెస్సే చేస్తున్నాయి. ఆయా మేనేజ్ మెంట్లు ప్రభుత్వాన్ని ఏమైనా ప్రభావితం చేయగలవా..? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి.
లెక్చరర్ల పరిస్థితేంటి..?
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. వారి సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు.. స్కూల్ ఎడ్యుకేషన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటాయి. విలీనమైన తర్వాత ఎలాంటి రూల్స్ ఫాలో అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అందుకే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే 10+2 రూల్ ఫాలో అవుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లోనే ఇంటర్మీడియెట్ కూడా ఉంది. ICSE, CBSE లోనూ ఇదే రూల్ ఉంది. కొన్ని చోట్ల ఇది సక్సెస్ అయిన ఫార్ములానే. ఎటొచ్చి.. మన పాఠశాల విద్య ఇంటర్మీడియెట్ స్థాయి ఎడ్యుకేషన్ అందిస్తుందా లేదా అన్నదే అసలు సమస్య. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కూడా కీలకమే. ఇంటర్మీడియెట్ అంటే ల్యాబ్ లు, లైబ్రరీలు లాంటివి కావాలి. మరి.. మన దగ్గర ఉన్న స్కూళ్లలో అవి ఎంతవరకు ఉన్నాయి..? ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి పక్కన పెడితే.. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా కరువే. అందుకే ప్రభుత్వ నిర్ణయంపై ఇన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఐతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అంతిమంగా విద్యార్థులకు న్యాయం జరగాలి. డ్రాపవుట్లు తగ్గిపోవాలి. ప్రధానంగా పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్ చదువుకునే అవకాశాలు రావాలి. అప్పుడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సార్థకత.


