తెలంగాణ

TG: రాయదుర్గంలో ‘గోల్డ్ మ్యాన్’ గుట్టు రట్టు చేసిన ఐటీ శాఖ!

TG: ఒంటినిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆరా తీసిన ఐటీ శాఖ, తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్‌ను, దాని ద్వారా వస్తున్న అద్దె డబ్బులను తాత్కాలికంగా జప్తు చేసింది.

TG: ఒంటినిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆరా తీసిన ఐటీ శాఖ, తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్‌ను, దాని ద్వారా వస్తున్న అద్దె డబ్బులను తాత్కాలికంగా జప్తు చేసింది.

యూట్యూబ్ ఇంటర్వ్యూలతో మొదలైన విచారణ

ఈ బినామీ ఆస్తి వ్యవహారం అంతా బయటపడటానికి చిన్న గౌడ్ ఇచ్చిన టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలే కారణమయ్యాయి. ఏప్రిల్ 3న ఆ ఇంటర్వ్యూలను చూసిన ఐటీ అధికారులు, అతనిపై విచారణ మొదలుపెట్టారు. తనిఖీలు చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాముల బంగారం దొరికితే, అందులో సరైన లెక్కలు లేని 700 గ్రాముల (సుమారు రూ. కోటి విలువైన) బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.

సంపాదన రూ. 4 లక్షలే.. కానీ కోట్లలో ఆస్తులు!

ఐటీ రిటర్నులలో తన ఏడాది సంపాదన కేవలం రూ. 4 లక్షలుగా మాత్రమే చూపించిన చిన్న గౌడ్, ఇంత భారీగా బంగారం కొనడానికి, భూములు కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన లెక్కలు చూపించలేకపోయారు. దీంతో అతని దగ్గరి వాళ్లు, బంధువుల బ్యాంక్ లావాదేవీలను చెక్ చేయగా రాయదుర్గం బినామీ బిల్డింగ్ విషయం బయటపడింది.

రాయదుర్గం బిల్డింగ్ వెనుక అసలు కథ ఇదే..

రాయదుర్గం నవ్ ఖల్సా ఏరియాలోని 222 గజాల స్థలంలో జీ ప్లస్ ఐదు అంతస్తుల బిల్డింగ్‌ను చిన్న గౌడ్ బంధువైన యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరు మీద రిజిస్టర్ చేశారు. అయితే, 2019 జులై 1న రూ. 26.7 లక్షలతో ఈ స్థలాన్ని కొన్నప్పుడు ప్రణయ్‌కు అసలు పన్ను కట్టేంత సంపాదనే లేదని అధికారులు గుర్తించారు. ప్రతి ఫ్లోర్‌లో రెండు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఉన్న ఈ బిల్డింగ్ నుంచి నెలకు రూ. 3.2 లక్షల అద్దె వస్తోంది. బిల్డింగ్‌తో అసలు సంబంధమే లేని ప్రణయ్ బావమరిది భార్య అకౌంట్‌లో ఈ అద్దె డబ్బులు పడి, అక్కడి నుంచి ఆమె భర్త అకౌంట్‌లోకి వెళ్తున్నట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ల ద్వారా అధికారులు పట్టుకున్నారు.

గతంలో తాను ఇచ్చిన అప్పును ప్రణయ్ అద్దె రూపంలో తిరిగి కడుతున్నాడని బావమరిది చెప్పినప్పటికీ, అందుకు ఎలాంటి అప్పు పత్రాలు లేకపోవడం, పైగా బిల్డింగ్ కట్టడానికి అతనే లోన్ తీసుకున్నట్లు ఆధారాలు దొరకడంతో ఐటీ అధికారులు ఆ మాటలను నమ్మలేదు. ప్రణయ్ కేవలం పేరుకు మాత్రమే ఓనర్ అని, అసలు యజమాని అతని బావమరిదేనని తేల్చుతూ నవంబర్ 17న ఐటీ జాయింట్ కమిషనర్ జప్తు ఆర్డర్స్ ఇచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు అధికారుల పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్‌ను అమ్మడం గానీ, వేరే వాళ్ల పేరు మీదకు మార్చడం గానీ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

తర్వాత చదవండి