ఏపీ

KonaseemaGasLeak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం!

4 నిమిషాల పఠనం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) సీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్ నుంచి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎత్తున గ్యాస్ లీకైంది.

 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) సీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్ నుంచి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎత్తున గ్యాస్ లీకైంది. భూమి కంపించినట్లుగా భారీ శబ్దాలతో గ్యాస్ ఎగసిపడటంతో నగరం, గెద్దాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 ఊరంతా దట్టంగా గ్యాస్ వాసన వ్యాపించడంతో ఏ క్షణాన ఏ పెను ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరం గ్రామ పరిధిలో గతంలో మూసివేసిన ఒక ఓఎన్జీసీ బావి వద్ద అధికారులు రీ-డ్రిల్లింగ్ పనులను చేపట్టారు. ఈ పనులు కొనసాగుతుండగానే అత్యధిక పీడనంతో, భారీ శబ్దాలు చేస్తూ గ్యాస్ బయటకు వెలువడటం ప్రారంభమైంది.

 సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ ప్రత్యేక నిపుణుల బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి అగ్నిప్రమాదం చోటుచేసుకోకుండా నీటిని వెదజల్లుతూ గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, గెద్దాడ సమీపంలోని జాతీయ రహదారి-216పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. 

 కాగా, ఇదే ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద భారీ బ్లో అవుట్ సంభవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. 2014లోనూ భారీ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు జరిగిన నగరం గ్రామంలోనే మళ్లీ ఇలాంటి ప్రమాదం పునరావృతం కావడంతో కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

 తరచూ ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్‌లైన్ల నుంచి గ్యాస్ లీకులు జరుగుతుండటంతో తమ ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#KonaseemaGasLeak2026#ONGCGasBlowoutMamidikuduru#NagaramVillageGasLeakKonaseema#NH216TrafficHaltedKonaseema#AndhraPradeshNewsTelugu#KonaseemaNewsTelugu#HydNewsTelugu#BreakingNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి