తెలంగాణలో దయనీయ పరిస్థితుల్లో వైద్యవ్యవస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోతున్నట్టు తెలిసింది. నిధులు లేక ఆస్పత్రి నిర్వాహణ కష్టతరంగా మారుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో సుమారు రూ.800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, రెగ్యులర్‌గా వచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఇప్పటికే సర్జరీలు బంద్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం పట్టించుకోక, సమయానికి నిధులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణకు సూపరింటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ నిధులతో పాటు, రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని సూపరింటెండెంట్లు వెల్లడించారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల పరిధిలోని 35 బోధనాస్పత్రులు, మరో 12 ప్రభుత్వ ఆసుపత్రులు, టీవీవీపీ పరిధిలోని 180కి పైగా ఆసుపత్రుల్లో మూడేళ్లుగా ఆరోగ్య శ్రీ నిధులు రాలేదని,ఫలితంగా శస్త్రచికిత్సలు నిలిపివేసినట్టు సమాచారం.
ఆస్పత్రుల వారీగా వివరాలు..
ఇక ఆస్పత్రుల వారీగా వివరాలు ఒకసారి చూసుకున్నట్టు అయితే ఉస్మానియా ఆసుపత్రికి రూ.173.80 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.54 కోట్లు, నిలోఫర్ ఆసుపత్రికి రూ.40 కోట్లు, సరోజినీ కంటి ఆసుపత్రికి రూ.14 కోట్లు, ఈఎన్‌టీ ఆసుపత్రికి రూ.11 కోట్లు, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.3 కోట్లు, కింగ్ కోఠి ఆసుపత్రికి రూ.4.6 కోట్లు, బాన్సువాడ ఆసుపత్రికి రూ.2.5 కోట్లు, మహబూబ్‌నగర్ ఆసుపత్రికి రూ.10 కోట్లు,ఇలా మొత్తంగా అన్ని ఆసుపత్రులు కలిపి దాదాపు రూ.800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద రూ.76.67 కోట్లు, ఈహెచ్‌ఎస్ బకాయిలు రూ.23.85 కోట్లు రావాల్సి ఉన్నట్టు సమాచారం. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఫండ్ అంశంలో కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో వెంటిలేటర్లు రిపేర్‌కు వచ్చాయని, కొన్ని ఆసుపత్రుల్లో స్కానింగ్ పరికరాలు చెడిపోయాయని, మరికొన్ని ఆసుపత్రుల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కూడా డబ్బులు లేవని వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆరోగ్యశ్రీతో పాటు రెగ్యులర్‌గా వచ్చే నిధులు విడుదల చేయాలని సూపరింటెండెంట్లు డిమాండ్ చేస్తున్నారు.


