తెలంగాణ

Telangana Congress : మహిళా కోటా ఎఫెక్ట్.. తెలంగాణ రాజకీయాల్లో వారసుల ఎంట్రీ!

తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త వారసత్వ అధ్యాయానికి తెరలేవబోతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

Telangana Congress: తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త వారసత్వ అధ్యాయానికి తెరలేవబోతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి 33 శాతం మహిళా కోటా అమల్లోకి వస్తే తమ సిట్టింగ్ సీట్లు చేజారిపోతాయన్న ఆందోళనలో ఉన్న మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు.. ఇప్పుడే ‘ఫ్యామిలీ ప్లాన్’ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బరిలోకి మంత్రుల కుమార్తెలు, సతీమణులు..

మహిళా రిజర్వేషన్ల కారణంగా తాము పోటీకి దూరంగా ఉండాల్సి వస్తే, తమ రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు కుటుంబంలోని మహిళలను బరిలో దింపాలని హస్తం నేతలు నిర్ణయించుకున్నారు. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే దాదాపు డజను మందికి పైగా కీలక నేతలు తమ సతీమణులు లేదా కుమార్తెలను రాజకీయాల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కుమార్తెల ఎంట్రీ ..

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తమ కుమార్తెలను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల పోటీ చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన సీనియర్లు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

విదేశాల్లో ఉన్న వారసులను రప్పించండి..

ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో చదువుకుంటున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న నేతల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే, వెంటనే వారిని ఇండియాకు పిలిపించాలని సీఎం సదరు నేతలకు సూచించినట్లు సమాచారం. ఎన్నికల సమయం దగ్గరపడ్డాక హడావుడి పడకుండా, ఇప్పటి నుంచే వారిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి సిద్ధం చేయాలని ఆయన సలహా ఇచ్చారట.

రిజర్వేషన్ల మార్పు వల్ల సిట్టింగ్ నేతలకు పోటీ చేసే అవకాశం లేకపోతే, వారి సతీమణి లేదా కుమార్తెకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను ఆయా నేతలకే అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనివల్ల పార్టీలో అసంతృప్తి తలెత్తకుండా ఉండటమే కాకుండా, గెలుపు అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, డీలిమిటేషన్, మహిళా కోటా ప్రభావం ఏయే నియోజకవర్గాలపై పడుతుందన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇప్పటికే ఒక అంచనా ఉంది. చివరికి తన సొంత నియోజకవర్గం కొడంగల్ సైతం వచ్చే ఎన్నికల్లో జనరల్ స్థానంగా ఉంటుందో, లేక రిజర్వేషన్ మారుతుందోనని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

అయితే, సరిహద్దులు మారినా, నియోజకవర్గాల స్వరూపం మారినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారాట. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే టికెట్లు ఆశించే అసంతృప్త నేతలందరికీ న్యాయం చేయవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మొత్తానికి, "కోటి ఓట్లు - 90 సీట్లు" అన్న లక్ష్యంతో కదులుతున్న సీఎం వ్యూహానికి, మహిళా కోటా నేపథ్యంలో వారసుల ఎంట్రీ తోడవడంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

తర్వాత చదవండి