దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేయాలని చూస్తున్నది. అందుకోసం దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50శాతం మేర పార్లమెంట్ సీట్లు పెంచేందుకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 25 ఏండ్ల వరకు మరల సీట్ల పెంపు, తగ్గించడం వంటివి ఉండవు. అప్పటివరకు సీలింగ్ ఉంటుంది.కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియా కూటమిలోని డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అంగీకారం తెలిపాయి.
చెన్నయ్‌కు రాహుల్, సోనియా.. స్టాలిన్‌తో భేటీ..
డీఎంకే పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని స్టాలిన్‌ను కోరేందుకు తాను, ఇండియా కూటమి నేతలు వెళుతున్నట్టు పేర్కొన్నారు.
లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కు పెంచడంతో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయబోతున్నారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.ఇది భారతదేశ ఎన్నికల చిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు పూర్తి అవకాశాన్ని ఇస్తుందని వెల్లడించారు. సోదరుడు స్టాలిన్ ఎల్లప్పుడూ తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డారని గుర్తుచేశారు. జాతీయ ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనందరం కలిసి ఈ బిల్లును ఓడించాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే స్టాలిన్ తాను డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఆయనను కలిస్తే బిల్లుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియా కూటమి వరుస భేటీలు..
డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇండియా కూటమి నేతలతో వరుసగా భేటీ అవుతోంది. ఇండియా కూటమి నేతల్లో డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కూటమి భేటీకి గైర్హాజరు అవ్వడంతో డీలిమిటేషన్ బిల్లుపై చర్చల కోసం చెన్నై, ముంబైకి ఖర్గే , సోనియా గాంధీ సైతం వెళ్లనున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాహుల్ గాంధీ చెన్నయ్ వెళ్లి స్టాలిన్‌ను కలవనున్నట్టు ప్రకటించారు.
ముందుగా ముంబై వెళ్లి శరద్ పవార్ పార్టీ నేతలతో సమావేశం అనంతరం సోనియా, ఖర్గే చెన్నయ్ వెళతారని తెలిసింది. అక్కడ తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌తో ఖర్గే , సోనియా చెన్నైలో భేటీ కానున్నట్టు సమాచారం. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన స్టాలిన్, శరద్ పవార్‌లతో ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలు చర్చలు జరపగా వారు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగారు. డీలిమిటేషన్‌పై ఉమ్మడి కార్యాచరణ దిశగా విపక్షాల అడుగులు వేస్తుండటంతో రేపు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది.
