Tollywood: తాజాగా మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ శనివారం నాడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశం ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాలలో అటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మహేష్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ముఖ్య కారణం ఏంటి? వీద్దరి మధ్య ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలపైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన మహేష్..
ఇక, ఈ భేటీలో ముందుగా మహేష్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మహేష్ బాబును శాలువాతో సత్కరించారు. వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుని, సాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, పలు విషయాలపై చర్చించినట్లుగా సమాచారం. అయితే, ఏ అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు మాత్రం ఇంకా, అధికారికంగా బయటకు రాలేదు. ప్రస్తుతం, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగే "ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్"లో భాగమవ్వాల్సిందిగా మహేష్‌ను ముఖ్యమంత్రి కోరినట్టుగా తెలుస్తోంది. కాగా, మహేష్ సినిమాల విషయానికొస్తే..దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. రుద్ర-శ్రీరాముడి గెటప్స్‌లో మహేష్ అద్భుతంగా ఉంటాడని తెలుస్తోంది.
ఇందులో, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నాడు. 2027 లో ఈ సినిమా భారీ స్థాయిలో 120 దేశాలలో 50 భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక, ఈ సినిమా మహేష్ కెరీర్లో రూపొందుతోన్న మొట్ట మొదటి పాన్ వరల్డ్ సినిమా కావడం విశేషం.
