Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొత్తగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత, ఇన్నాళ్లూ బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నా గులాబీ పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇకపై కవిత వేసే ప్రతి బాణానికి అంతే బలంగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం డిసైడ్ అయింది. అసలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గులాబీ దళం, సడన్‌గా ఎందుకు రూట్ మార్చింది? దీని వెనుక ఉన్న ఆ భయం ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల కంటే కవిత నుంచే బీఆర్ఎస్‌కు ఎక్కువ సెగ తగులుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నిజానికి మొదట్లో కవిత వ్యాఖ్యలకు తాము స్పందిస్తే ఆమెకు అనవసరమైన మైలేజ్ ఇచ్చినట్లవుతుందని, మీడియాలో ఆమెను హీరోని చేసినట్లవుతుందని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావించింది. అందుకే కీలక నేతలెవరూ నోరు విప్పకుండా, కేవలం సోషల్ మీడియాలో కార్యకర్తలతోనే కౌంటర్లు ఇప్పిస్తూ సైలెంట్‌గా ఉండిపోయింది.
కానీ, ఇక్కడే బీఆర్ఎస్‌కు అసలు భయం పట్టుకుంది. తాము మౌనంగా ఉండటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పార్టీ వర్గాలు ఆలస్యంగా గుర్తించాయి. ఎందుకంటే కవిత బయటి వ్యక్తి కాదు.. ఒకప్పుడు బీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేత. పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ ఆమెకు తెలుసనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాంటి వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై పార్టీ స్పందించకపోతే, "ఆమె చెప్పేవన్నీ నిజమే కాబోలు.. అందుకే వీళ్లు సైలెంట్‌గా ఉన్నారు" అని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని గులాబీ దళం ఆందోళన చెందుతోంది.
ఈ నష్టాన్ని ఆపాలంటే ఇక మౌనం వీడటమే సరైన మార్గమని బీఆర్ఎస్ అధిష్ఠానం ఫిక్స్ అయింది. మీడియా సమావేశాలు, పార్టీ వేదికల ద్వారా ఎప్పటికప్పుడు కవిత విమర్శలను తిప్పికొట్టాలని నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల సిద్దిపేటలో హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె ఆరోపణలు ఇలాగే కొనసాగితే ఇతర పార్టీల నేతల మాదిరిగా వదిలిపెట్టబోమని, అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే, ఈ కౌంటర్ అటాక్‌లో బీఆర్ఎస్ ఒక తెలివైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నేరుగా రంగంలోకి దిగి కవితకు సమాధానం చెప్పకుండా, పార్టీలోని ఇతర ముఖ్య నేతల ద్వారానే ఆమె విమర్శలకు చెక్ పెట్టాలని తెలంగాణ భవన్ వర్గాలు స్కెచ్ వేశాయి. మొత్తానికి "సైలెంట్‌గా ఉంటే నిజమని నమ్ముతారు" అనే భయంతో రూట్ మార్చిన బీఆర్ఎస్, ఇకపై కవితకు ఏ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తుందో చూడాలి.


