తెలంగాణ

BJP : తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ.. నిధుల్లో భారీ కోత!

4 నిమిషాల పఠనం

తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్ర కమలం నేతలు పదే పదే డప్పులు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రం మీద చూపిస్తున్న కపట ప్రేమ తేటతెల్లం అయ్యింది.

తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్ర కమలం నేతలు పదే పదే డప్పులు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రం మీద చూపిస్తున్న కపట ప్రేమ తేటతెల్లం అయ్యింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, జీఎస్‌టీ పరిహార గ్రాంట్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిసింది. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఎలాంటి ప్రయోజనం చేకూరినట్టు కనిపించడం లేదని పేర్కొంటున్నారు.

రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లే మొత్తంలో సగం కూడా కేంద్రం నుంచి తిరిగి రావడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల వలే సమానంగా అభివృద్ధి చేస్తామని పదే పదే చెప్పుకునే ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు పెడుతోందని తెలుస్తోంది. గత పదేళ్లలో 12 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం వాటా తగ్గిందని తెలిసింది. తెలంగాణకు రావాల్సిన వాటాలో కేంద్ర ప్రభుత్వం భారీ కోతలు పెడుతోందని "పబ్లిక్ ఫైనాన్స్ ఆఫ్ తెలంగాణ.. ట్రెండ్స్, ఛాలెంజెస్, పాలసీ ప్రయారిటీస్" అనే నివేదికలో ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ వెల్లడించింది.

2015–16 సంవత్సరంలో తెలంగాణ రెవెన్యూ రాబడిలో కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా 12 శాతం ఉండగా, 2024–25 సంవత్సరంలో అది 5 శాతానికి పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెవెన్యూ లోటు పరిహారాన్ని కేంద్రం అందిస్తుండగా.. తెలంగాణకు మాత్రం అందించడం లేదు. జీఎస్‌టీ పరిహార గ్రాంటు 2022–23లో 30.8% (రూ.4,062 కోట్లు) ఉండగా, 2023–24లో 6.3% (రూ.625 కోట్లు)కి పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2020–21లో సహాయక గ్రాంట్లు రూ.15,471 కోట్లు రాగా, 2024–25లో కేవలం రూ.7,913 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 14, 15వ ఆర్థిక సంఘాల గ్రాంట్ల కింద 2019–20లో రాష్ట్రానికి రూ.3,219 కోట్లు రాగా, 2024–25 సంవత్సరంలో కేవలం రూ.1,589 కోట్లు మాత్రమే వచ్చాయి.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కంటున్న బీజేపీ నాయకులు ముందు ఈ నిధుల కోత విషయంలో సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. 82 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#BJP#central funds#cm revanth reddy#congress#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి