తెలంగాణలో మరో లాకప్ డెత్ నమోదు చేసుకున్నట్టు సమాచారం. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పొలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపిస్తోంది.కాగా, పోస్టుమార్టం నివేదిక తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
వివరాల్లోకివెళితే.. వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ జడ్చర్లలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వరుణ్ తాను పనిచేస్తున్న లాడ్జి నుంచి ఒక ల్యాప్‌టాప్, సుమారు రూ.32వేల నగదుతో పరారయ్యాడని లాడ్జి యజమాని శ్రీకాంత్ ఆదివారం ఉదయం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
లాడ్జి యజమాని, సిబ్బంది గాలించగా అదే మధ్యాహ్నం బాలానగర్‌లో వరుణ్ దొరికాడు. వెంటనే అతడిని తీసుకొచ్చి జడ్చర్ల పోలీసులకు అప్పగించారు. అయితే పీఎస్‌లో ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైన వరుణ్.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల వేధింపులు,విచక్షణారహితంగా కొట్టడం వల్లే తమ కుమారుడు మరణించాడని మృతుడి తల్లి అరుణ, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుణ్‌ను లాకప్ డెత్ చేశారని వస్తున్న ఆరోపణలపై మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పందించారు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, పోలీసులు అతడిపై ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. వరుణ్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు అతడు మద్యం సేవించి ఉన్నాడని, బ్రీత్ అనలైజర్ పరీక్షలో రీడింగ్ నమోదైందన్నారు. స్టేషన్ ఆవరణలో బెంచ్‌పై కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఫిట్స్ రావడంతో కిందపడి మరణించాడని ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
గతంలోనూ లాకప్ డెత్ కేసులు?
ఈ ఏడాది ఆగస్టులో మహబూబాబాద్ సబ్-జైలులో పాత హత్య కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్‌పై వచ్చిన జనగామ వెంకటేష్ (32) జ్యుడీషియల్ కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మరణించాడు. జైలు అధికారులు దాడి చేయడం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక గతేడాది చివరలో కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద కస్టోడియల్ డెత్ జరిగింది. ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించింది.


