అంతర్జాతీయం

Trump Tariffs : ఇండియాకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్

భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. 7 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం వరకు కొత్త టారిఫ్స్ విధించాలని అమెరికా నిన్న ప్రతిపాదించింది.

భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. 7 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం వరకు కొత్త టారిఫ్స్ విధించాలని అమెరికా నిన్న ప్రతిపాదించింది. ఇతర దేశాల నుంచి చౌకగా అమెరికాలోకి వస్తువులు వస్తుండటంతో స్థానిక కంపెనీలు నష్టాల్లోకి వెళ్తున్నాయని, ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని భావించిన అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.

ఏయే దేశాలపై ప్రభావం..

ట్రంప్ నిర్ణయంతో భారత్‌ సహా కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్ వంటి దేశాలపై సుంకాల భారం పడనుంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) ఆఫీస్ రూపొందించిన ఈ ప్రతిపాదనను రాయిటర్స్ వెల్లడించింది. ఇదిలాఉండగా, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 40 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదన కూడా ఇందులో ఉందని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయ వస్తువులపై సుంకం 17 శాతానికే పరిమితం కావచ్చని యూఎస్‌టీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.

ఒకవేళ ఒప్పందం కుదరకపోతే 25 శాతం వరకు సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం. అయితే, భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సుంకాలు కేవలం ప్రతిపాదిత దశలోనే ఉన్నాయి. వెంటనే అమల్లోకి రావు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత 2027 జనవరిలో అమల్లోకి రానున్నట్టు సమాచారం.

ట్రంప్ మళ్లీ సుంకాలు విధించాలని నిర్ణయానికి రావడానికి ఓ ప్రధాన కారణం ఉన్నది. 16 ఆర్థిక వ్యవస్థలపై అమెరికా చేపట్టిన 8 నెలల దర్యాప్తు తర్వాత 14 వాణిజ్య భాగస్వాములపై కొత్త సుంకాల ప్యాకేజీని అమెరికా ప్రతిపాదించింది. చైనా మీద 40 శాతం వరకు, వియత్నాంపై 35 శాతం , భారత్ సహా మరో ఆరు దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఐరోపా దేశాలు, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై 20 శాతం వరకు సుంకాలు ఉండవచ్చని సమాచారం.

తర్వాత చదవండి