తెలంగాణ

Bhu Bharati Portal Scam: ‘భూ భారతి’లో ఆపరేటర్ల గోల్‌మాల్!

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ భద్రతకే కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు పెను సవాల్ విసిరారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే వెబ్‌సైట్ బ్యాక్-ఎండ్ ప్రోగ్రామింగ్‌లోకి అక్రమంగా చొరబడి, రూ.కోట్ల విలువైన భూముల యాజమాన్య హక్కులను మార్చేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

  • ఆరు జిల్లాల్లో అక్రమ లాగిన్ల కలకలం

  • Ctrl+i షార్ట్‌కట్‌తో సోర్స్ కోడ్‌లో మార్పులు

  • రంగంలోకి 15 సీఐడీ ప్రత్యేక బృందాలు

  • దర్యాప్తులో సంచలన నిజాలు!

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ భద్రతకే కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు పెను సవాల్ విసిరారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే వెబ్‌సైట్ బ్యాక్-ఎండ్ ప్రోగ్రామింగ్‌లోకి అక్రమంగా చొరబడి, రూ.కోట్ల విలువైన భూముల యాజమాన్య హక్కులను మార్చేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ హైటెక్ భూకుంభకోణంపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన సూత్రధారుల గుట్టురట్టు చేసేందుకు సీఐడీ అధికారులు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సోదాలు, విచారణ నిర్వహిస్తున్నారు.

‘RT’గా ఉన్న అక్షరాలను ‘R0’గా మార్చి..

ఈ మోసం వెనుక ఉన్న సాంకేతిక కోణాన్ని సీఐడీ సైబర్ నిపుణులు తాజాగా ఛేదించారు. మండల కార్యాలయాల్లో సంబంధిత రెవెన్యూ అధికారి పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఆపరేటర్లు కీబోర్డ్‌పై Ctrl+i షార్ట్‌కట్‌ను ఉపయోగించి నేరుగా వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, నిషిద్ధ జాబితాలో ఉన్న ఆస్తులకు సాధారణ పరిస్థితుల్లో చలాన్లు జారీ కావు. అయితే, కేటుగాళ్లు సోర్స్ కోడ్‌లో ఉన్న 'ఆర్ టీ' (RT) అనే కోడ్ అక్షరాలను 'ఆర్ ఓ' (R0)గా మార్చడం ద్వారా వ్యవస్థను బురిడీ కొట్టించి, ప్రభుత్వ భూములకు సైతం చలాన్లు వచ్చేలా చేసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు దర్యాప్తులో తేలింది.

‘భూ భారతి’ సాంకేతిక లొసుగులు గుర్తించి..

రెవెన్యూ శాఖలోని ఓ కీలక విభాగంలో పనిచేస్తున్న ఆపరేటర్ ఈ సాంకేతిక లొసుగును మొదటగా గుర్తించి, తన సన్నిహిత ఆపరేటర్లకు ఈ విధానాన్ని నేర్పినట్లు సీఐడీ అనుమానిస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో ఈ తరహా అక్రమ లాగిన్లు భారీగా జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. గతంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించిన దాదాపు 22వేల అనుమానాస్పద లావాదేవీలను ప్రామాణికంగా తీసుకుని, రాత్రి వేళల్లో జరిగిన అనుమానాస్పద మార్పులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

సీఐడీ అదుపులో ‘అలీ గ్యాంగ్’

ఈ దందాలో ఇప్పటికే పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆర్డీవో అనుమతి లేకుండానే రూ.90 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేసిన వ్యవహారంలో ఆపరేటర్ సహా నలుగురిని, గజ్వేల్‌కు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా అందోలు మండలం సంగుపేటలో ఓ రిటైర్డ్ డీజీపీకి చెందిన 4.5 ఎకరాల భూమిని ఆయనకు తెలియకుండానే ‘అలీ గ్యాంగ్’ అనే ముఠా ఆపరేటర్ల సాయంతో ఇతరుల పేర్లపైకి బదలాయించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన ఆయన సతీమణి ఫిర్యాదుతో ఈ ముఠా సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుల్లో మొత్తం 9 మంది అరెస్ట్ కాగా, వారిని కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

‘రెవెన్యూ’ ప్రమేయం లేనట్లే నటిస్తూ అక్రమాలు

మరోవైపు, కూకట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి ఎలాంటి దరఖాస్తులు అందకపోయినా, పాసుపుస్తకాలు లేకుండానే నాలా (NALA) కన్వర్షన్ ప్రక్రియను పూర్తి చేసిన ఉదంతంపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొందరు ఆపరేటర్లు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, వారి ప్రమేయం లేనట్లే నటిస్తూ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ‘ధరణి’, ప్రస్తుతం ‘భూ భారతి’ పోర్టల్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక సంస్థల పనితీరు, భద్రతా ప్రమాణాలపై రెవెన్యూ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కీలక సర్వర్ డేటా స్వాధీనం

ఇప్పటికే పోర్టల్ నిర్వహణ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక సర్వర్ డేటాను స్వాధీనం చేసుకున్న సీఐడీ, అక్రమ మ్యుటేషన్ల లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఆపరేటర్లతో చేతులు కలిపిన రెవెన్యూ సిబ్బంది పాత్రపైనా లోతైన విచారణ జరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తర్వాత చదవండి