కాంగ్రెస్ లో కయ్యాలు షురూ...
సిద్దిపేట సభలో రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్
ఆ ఇద్దరూ ఊరుకుంటారా..?
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయా? అధికారం చేతిలో ఉన్నా.. సొంత పార్టీ నేతల నుంచే సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు ఎదురవుతున్నాయా? ఇన్నాళ్లూ ఎవరి దారిలో వారు అన్నట్టుగా సాగిన వ్యవహారం.. ఇప్పుడు బహిరంగ విమర్శలు, కౌంటర్ల వరకు చేరిందా? సిద్దిపేట వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
పార్టీలో కొంతమంది మంచి పిచ్చోళ్లున్నారంటూ మొదలుపెట్టిన రేవంత్.. పిచ్చికుక్కలు కరిస్తే మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. అలాంటి వాళ్లను తమ పార్టీ కార్యకర్తలే పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారంటూ సెటైర్లు పేల్చారు. మాటల్లోనే కాదు.. హెచ్చరికలోనూ ఘాటు పెంచారు సీఎం. ఐతే రేవంత్ రెడ్డి ఎవరినీ పేరుపెట్టి విమర్శించలేదు. కానీ ఆయన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పనితీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలే ఈ వ్యాఖ్యల టార్గెట్ అన్న ప్రచారం జరుగుతోంది. అంటే.. కాంగ్రెస్‌లో అంతర్గత అసమ్మతి ఇప్పుడు నాలుగు గోడల మధ్య చర్చగా మిగిలిపోలేదు. ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై స్పందించే స్థాయికి చేరిందన్న మాట.
గొడవ ఎక్కడ మొదలైంది..?
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అనిరుధ్ రెడ్డి దానికి ఇంకాస్త ఫైర్ యాడ్ చేశారు. ఐతే ఈ విభేదాలు ఎక్కడ మొదలయ్యాయనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ.. ఇక మంత్రి పదవి దక్కదన్న క్లారిటీ వచ్చిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి గళం పెంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులు, ప్రభుత్వంలో ప్రాధాన్యత, సీఎం వ్యవహారశైలి.. ఇలా అనేక అంశాలు కాంగ్రెస్‌లో అసమ్మతికి కారణమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని, కొడంగల్, మధిర వంటి ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు చేశారు. ఇటీవల మునుగోడులో జరిగిన కార్యక్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులు ఆపితే యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. సీఎం మాట్లాడే భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపులు, అధికారుల వ్యవహారశైలిపై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ ఆయన చేసిన ఆరోపణలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయట. ఇద్దరు ఎమ్మెల్యేల విమర్శలు వేర్వేరు సందర్భాల్లో వచ్చినా.. వాటి వెనుక ఉన్న ఉమ్మడి అంశం మాత్రం ప్రభుత్వ పనితీరు, నాయకత్వంపైనే ఉంది.
ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఎలా తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి మాటలను తమపై చేసిన విమర్శలుగా భావించి మళ్లీ ఎదురుదాడికి దిగుతారా? లేక పార్టీ వేదికలపై సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారా? అనేది చూడాలి. ఐతే రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన అన్నీ డిసైడయ్యాకే దూకుడు పెంచారనేది పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ.
కొత్త ఇన్ఛార్జ్కు ఫస్ట్ టెస్ట్
కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియమితులయ్యారు. నవంబర్ 15న ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయన రావడం కూడా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలక పరిణామం. అయితే కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టే సమయానికే పార్టీలో అసమ్మతి స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత విభేదాలపై ఏఐసీసీ నివేదిక కోరినట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగంగా పార్టీ నేతలను విమర్శిస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు సమాచారం.
అధికారం ఉన్నా.. తప్పని అసమ్మతి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పార్టీ.. సొంత నేతల విమర్శలతో వార్తల్లో నిలవడం నాయకత్వానికి ఇబ్బందికరమే. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడం ఒక ఎత్తయితే.. సొంత పార్టీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం మరో ఎత్తు. అయితే ఈ అసమ్మతిని కేవలం వ్యక్తిగత విభేదాలుగా కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గాలకు నిధులు, అభివృద్ధి పనుల బిల్లులు, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యత.. ఇవన్నీ ఎమ్మెల్యేల అసంతృప్తిలో భాగంగా ఉన్నాయి. వీటికి రాజకీయ కోణం కూడా తోడైతే సమస్య మరింత జటిలమవుతుంది.
మరి.. ఇప్పుడు సీఎం ఏం చేయనున్నారు..? తెలంగాణ కాంగ్రెస్ ముందున్న అసలు పరీక్ష ఏంటి..? రేవంత్ రెడ్డి తన దూకుడుతో రెబల్స్‌కు కళ్లెం వేస్తారా? రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వెనక్కి తగ్గుతారా? లేక కొత్త ఇన్ఛార్జ్ బీఎం సందీప్ ముందే ఈ పంచాయితీ ఢిల్లీ పెద్దల చెంతకు చేరుతుందా? రానున్న రోజుల్లో అధికార పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి..? ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను వెంటాడుతున్న ప్రశ్నలు. మొత్తానికి సీఎం రేవంత్.. సిద్దిపేట సభలో చేసిన వ్యాఖ్యలు.. విపక్షాలకు ఎంత కోపం తెప్పించాయో తెలియదు కానీ.. సొంత పార్టీలోని కొందరు నేతలకు మాత్రం షాకిచ్చాయనే ప్రచారం జరుగుతోంది.
