రెండేళ్ల ముందే తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సభలు
సిద్దిపేట సభతో జోష్ పెంచిన రేవంత్
ఎదురుదాడి పెంచిన బీఆర్ఎస్
అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్
తెలంగాణలో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూనే రాజకీయంగానూ దూకుడు పెంచుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతూ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ కూడా సంస్థాగతంగా బలపడుతూ పోటీకి సిద్ధమవుతోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది.
హరీష్ అడ్డాలో రేవంత్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సిద్దిపేట ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో సంక్షేమ పథకాల ప్రారంభంతో పాటు రూ.544 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు. కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ సభలో అసలు రాజకీయ హైలైట్ మాత్రం రేవంత్ చేసిన సవాలే. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గానికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. హరీష్ రావు రాజకీయంగా బలంగా ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలన్న సంకేతాలు ఇచ్చారు. అంతకుముందు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సభ నిర్వహించారు. ఇప్పుడు హరీష్ రావు అడ్డాలో అడుగుపెట్టారు. తర్వాత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ సభ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాల్లో వరుసగా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ఎదురుదాడి.. ప్రజల్లోకి నాయకులు
బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ దూకుడుకు దీటుగా స్పందిస్తోంది. సాగునీటి వివాదాలు, రైతుల సమస్యలు, ఎల్‌నినో ప్రభావం, కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇలా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ఏపీ ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శిస్తున్నారు. కాళేశ్వరం విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
బీఆర్ఎస్ కేవలం రాజకీయ విమర్శలతోనే ఆగిపోవడం లేదు. కేటీఆర్, హరీష్ రావు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రైతు సమస్యలపై కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 2027లో కేటీఆర్ పాదయాత్ర చేపట్టే ప్రణాళిక కూడా ఉంది. ఆ తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టే అవకాశంపై చర్చ సాగుతోంది. ప్రభుత్వంపై పోరాటంతో పాటు పార్టీ కేడర్‌ను తిరిగి యాక్టివ్ చేయడం, ప్రజల్లో కోల్పోయిన మద్దతును సంపాదించడం బీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
బీజేపీ లెక్కలు వేరు..
ఈ మొత్తం పొలిటికల్ ఎపిసోడ్ లో బీజేపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో మూడో శక్తిగా మిగిలిపోకుండా అధికారానికి పోటీపడే స్థాయికి ఎదగాలనుకుంటోంది కమలం పార్టీ. ఇప్పటికే జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సునీల్ బన్సల్ పర్యటనలు, వరుస సమావేశాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై కసరత్తు ఇందులో భాగమే. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో పట్టు సాధించాలనుకుంటోంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన 48 స్థానాల బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపైనా ఫోకస్ చేసింది.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు కూడా బీజేపీకి కీలకంగా మారనున్నాయి. మార్చి 2027లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటికే సమావేశాలు, ఓటర్ల నమోదు, బూత్ స్థాయి సమన్వయంపై కసరత్తు చేస్తోంది. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని భావిస్తోంది బీజేపీ.
అసలు టార్గెట్ 2028
మూడు పార్టీల దారులు వేరైనా.. అసలు టార్గెట్ మాత్రం 2028 ఎన్నికలే అని స్పష్టమవుతోంది. అంతకంటే ముందే అనేక రాజకీయ పరీక్షలు ఎదురుకానున్నాయి. మూడు గ్రేటర్ కార్పొరేషన్లు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇవన్నీ పార్టీల బలాబలాలను అంచనా వేయడానికి కీలకంగా మారనున్నాయి. ఖైరతాబాద్ ఉపఎన్నిక అంశం కూడా కోర్టు, ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంది. 2028 సరే.. మరి మధ్యలో వచ్చే ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఎలా పనిచేస్తాయి? తెలంగాణ రాజకీయాల్లో పైచేయి ఎవరిదవుతుంది? అధికార కాంగ్రెస్ దా లేక బీఆర్ఎస్ దా..? ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ దూసుకొస్తుందా..? ఈ నిర్ణయం మాత్రం ఓటరు చేతిలోనే ఉంది.
