తెలంగాణ

క్షేత్రస్థాయి పోరుకు బీజేపీ సన్నద్ధం.. డిసెంబర్ 1 నుంచి 119 నియోజకవర్గాల్లో 25రోజుల ఆందోళనలు!

తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ దూకుడు పెంచేందుకు కొత్త వ్యూహానికి తెరలేపింది. మొన్నటి వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వంటి జాతీయ అంశాలపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన బీజేపీ, ఇకపై రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునే లక్ష్యంతో స్థానిక సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించింది.

తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ దూకుడు పెంచేందుకు కొత్త వ్యూహానికి తెరలేపింది. మొన్నటి వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వంటి జాతీయ అంశాలపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన బీజేపీ, ఇకపై రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునే లక్ష్యంతో స్థానిక సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 25 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు పర్యటించి ప్రజా సమస్యలను గుర్తిస్తారని, వాటి పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహిస్తారని పార్టీ వెల్లడించింది.

ఈ కార్యాచరణకు ముందు హైదరాబాద్, కామారెడ్డి, నల్గొండలో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్న వేళ ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను మరోసారి బలంగా లేవనెత్తుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు తెలిపారు. సాగునీరు, తాగునీటి సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు. వరి సాగు చేయవద్దని రైతులకు సూచిస్తున్న నేపథ్యంలో అధికారికంగా పంట సెలవు ప్రకటించకపోయినా, ఇతర పంటలకు అనుకూలంగా లేని భూములు బీళ్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా నష్టపోయే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు హైదరాబాద్, నిర్మల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన 'మహా పాదయాత్ర', కరీంనగర్‌లో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాదయాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. ఈ పాదయాత్రల విజయంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనడానికి సంకేతమని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని రామచందర్ రావు జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుందని విమర్శించారు. డిసెంబర్ 1 నుంచి జరిగే 25 రోజుల ఉద్యమంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.

తర్వాత చదవండి