ఏపీ

AP : కిలో కందిపప్పు రూ.100, పామాయిల్ రూ.125 .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సబ్సిడీపై అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బియ్యం ధరల కట్టడికి చర్యలు చేపట్టిన కూటమి సర్కార్..

ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సబ్సిడీపై అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బియ్యం ధరల కట్టడికి చర్యలు చేపట్టిన కూటమి సర్కార్..ఔట్‌లెట్స్ ద్వారా సబ్సిడీపై సన్నబియ్యం అందిస్తోంది. దీనికి తోడు పప్పులు, నూనె సైతం అందించేందుకు తాజాగా నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు దారులు వీటిని తీసుకోవడానికి అర్హులు..

బుధవారం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు కందిపప్పు, పామాయిల్ పంపిణీని ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు కిలో కందిపప్పును రూ. 100కు, లీటర్ పామాయిల్‌ను రూ. 125కు అందించాలని సీఎం ఆదేశించారు.

దాంతో పాటు మార్కెట్ జోక్య పథకం కింద రూ.25కే కిలో గోధుమపిండిని కూడా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ధరణి బియ్యం కేంద్రాలను విస్తరించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సబ్సిడీ ధరలకు 'ధరణి' బ్రాండ్ సన్నబియ్యం విక్రయించేందుకు 286 కేంద్రాలు పనిచేస్తుండగా, ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా వాటిని 500 కేంద్రాలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ కేంద్రాల ద్వారా 26 కిలోల బ్యాగులలో KNM/RNR బియ్యాన్ని కిలో రూ. 50కి (బహిరంగ మార్కెట్ ధర రూ. 76), BPT ముడి బియ్యాన్ని కిలో రూ. 49కి (మార్కెట్ ధర రూ. 66) విక్రయిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కందిపప్పు కొరత లేకుండా కేంద్రం కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందుల సరఫరాను వేగవంతం చేయాలని, సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా టోల్ గేట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాబోయే 18 నెలల పాటు మార్కెట్ ధరలను నిరంతరం పర్యవేక్షించాలని కూడా సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పేద, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తర్వాత చదవండి