తెలంగాణ

తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందా..? కిషన్ రెడ్డి వార్నింగ్ తో పొలిటికల్ హీట్

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? ఇప్పటికే జాతీయ నేతలు వరుసపెట్టి సమావేశాలు నిర్వహించడం వెనుక కారణాలేంటి..? తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అర్థమేంటి..? అసలు తెలంగాణలో బీజేపీ వ్యూహమేంటి..?

తెలంగాణలో బీజేపీ ఆట షురూ

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కిషన్ రెడ్డి వార్నింగ్

దేశంలో కాంగ్రెస్ పనై పోయిందన్న కిషన్ రెడ్డి

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? రాష్ట్ర రాజకీయాల్లో ఇక దూకుడు పెంచబోతోందా? ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే సాగుతున్న రాజకీయ పోరులో ఇక తాము కూడా కీలక పాత్ర పోషిస్తామని కమలనాథులు సంకేతాలిస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణలో ఇక బీజేపీ తన ఆట మొదలుపెడుతుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ పై ఫైర్

రాహుల్ గాంధీపై కూడా కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశాన్ని పదే పదే విమర్శిస్తూ రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశానికి సంబంధించిన విషయాల్లో సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం వెనుకబడిందని, అవినీతి పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో జెండా పాతేది మేమే... కిషన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు ఎలా గెలిచిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలని అన్నారు కిషన్ రెడ్డి. రాబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ బలహీనతలను బయటపెట్టుకుంటున్నాయని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దోపిడీ చేశాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని, తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహంపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, బీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకోవడం, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.. పార్టీ వ్యూహమెలా ఉండబోతోందో చెబుతున్నాయి.

తర్వాత చదవండి