కుప్పకూలిన బంగారం ధరలు
ఒక్కరోజే రూ. 10 వేలు తగ్గిన పసిడి
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమా..?
10 గ్రాముల బంగారం రూ. 80 వేలకు చేరుకుంటుందా..?
చుక్కలనంటిన బంగారం ధరలు ఎంచక్కా దిగొస్తున్నాయి. భవిష్యత్ లో బంగారం కొంటామో.. కొనమో అనుకున్న జనానికి ఈ వార్త.. ఫుల్ జోష్ ఇస్తోంది. వాస్తవానికి బంగారం ధరలు పెరుగుతున్నాయంటే చాలు.. కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలవుతుంది. తగ్గుతున్నాయంటే మాత్రం కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇప్పుడు దేశీయ మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితి ఇదే. కొద్ది నెలల కిందట లక్షన్నర రూపాయల మార్కును దాటిన 10 గ్రాముల బంగారం.. ఇప్పుడు లక్షా 25 వేల రూపాయల స్థాయికి పడిపోయింది. ఒక్కరోజులోనే వేల రూపాయల పతనం కనిపిస్తోంది. దీంతో బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయా? లేక ఇదే కొనుగోలుకు సరైన సమయమా? అన్న చర్చ మొదలైంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధర ఎంత..?
నవంబర్ 20న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,570గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,100 దగ్గర ఉంది. అంతకుముందు రోజుతో పోలిస్తే ధర భారీగా తగ్గింది. అంటే ఒక్కరోజులోనే భారీ పతనం కనిపించింది. ఇక ఈ పతనాన్ని జనవరి నెలలో నమోదైన గరిష్ఠ ధరలతో పోలిస్తే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. జనవరి 29న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,850కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,63,950గా నమోదైంది. ఇప్పుడు ఆ ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం రూ.53,280, 22 క్యారెట్ల బంగారం రూ.48,850 తగ్గాయి. అంటే గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 శాతం పతనం కనిపిస్తోంది.
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
బంగారం ధరల పతనం వెనుక ప్రధానంగా అమెరికా ఆర్థిక విధానాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులకు బాండ్లు, డిపాజిట్ల వంటి పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బంగారం ఎలాంటి వడ్డీ ఇవ్వదు. ధర పెరిగితేనే లాభం వస్తుంది. అందుకే వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు వచ్చినప్పుడు కొంతమంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ డబ్బును ఇతర పెట్టుబడుల వైపు మళ్లిస్తారు.
మరో కీలక కారణం డాలర్ బలం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. దీంతో కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడం కూడా బంగారానికి ప్రతికూలంగా మారుతోంది. వడ్డీ వచ్చే బాండ్లతో పోలిస్తే వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
ఇక ఈసారి మరో అంశం కూడా పతనానికి తోడైంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా ఏఐ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి బంగారం వంటి ఆస్తులను కూడా అమ్ముతున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది.
బంగారం ఇక డౌన్ ట్రెండేనా..? మళ్లీ పెరుగుతుందా..?
బంగారం ధరలు ఇంక కిందకేనా..? లేక మళ్లీ పెరుగుతాయా..? ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న ప్రశ్నలివి. ఇక్కడే మార్కెట్లో భిన్నమైన అంచనాలు కనిపిస్తున్నాయి. స్వల్పకాలంలో బంగారం ధరలు మరింత తగ్గవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే.. దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు. ధరలు పడుతున్నప్పటికీ అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, తమ విదేశీ మారక నిల్వలను విభిన్నంగా ఉంచుకోవడం కోసం బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ ఫిజికల్ గోల్డ్ కి డిమాండ్ కొనసాగుతోంది.
బంగారం రూ. 80 వేలకు తగ్గుతుందా..?
సామాన్య కొనుగోలుదారుల్లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలకు వస్తుందా? చివరికి 80 వేల రూపాయలకు కూడా పడిపోతుందా? ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,570గా ఉంది. ఇది లక్ష రూపాయలకు చేరాలంటే మరో 20 శాతానికి పైగా తగ్గాలి. 80 వేల రూపాయలకు రావాలంటే ప్రస్తుత ధర నుంచి దాదాపు 36 శాతం పతనం కావాలి.
ఇంతటి పతనం జరగాలంటే అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెద్ద మార్పులు చోటుచేసుకోవాలి. డాలర్ బలంగా కొనసాగాలి. అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువకాలం అధిక స్థాయిలో ఉండాలి. బంగారంపై పెట్టుబడుల డిమాండ్ తగ్గాలి. రూపాయి విలువలో మార్పులు కూడా దేశీయ ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే 80 వేల రూపాయలకు బంగారం వస్తుందని ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. అదే సమయంలో ధరలు ఇక తగ్గవని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు.
కొనేందుకు ఇదే సరైన టైమా..?
బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఒక అవకాశం కావచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాల్సిన కుటుంబాలకు కొంత ఊరట లభిస్తోంది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయనే ఆశతో కొనుగోళ్లను పూర్తిగా వాయిదా వేయడం కూడా కొంత రిస్క్‌తో కూడుకున్నదే. బంగారం కొనుగోలు చేసేవారు తమ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆభరణాల కోసం కొనేవారు ధరలతో పాటు మేకింగ్ ఛార్జీలు, ఇతర ఖర్చులనూ పరిశీలించాలి. పెట్టుబడి కోసం కొనేవారు స్వల్పకాలిక ధరల హెచ్చుతగ్గులకంటే తమ దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తానికి బంగారం మార్కెట్ ఇప్పుడు కీలక మలుపులో ఉంది. ఒకవైపు అమెరికా నిర్ణయాలు, డాలర్ బలం ధరలను కిందకు లాగుతుంటే.. మరోవైపు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, దీర్ఘకాలిక పెట్టుబడుల ఆసక్తి బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరుగుతాయా.. లేక తగ్గుతాయా అన్నది ఇప్పుడే చెప్పడం ఎవరి తరమూ కాదు.
