తెలంగాణ

BRS Party: గులాబీ దళం సరికొత్త ప్లాన్! ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక టీమ్!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. చలికాలంలోనూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. అయితే ఇన్ని రోజులు ప్రత్యర్థుల విమర్శలను మౌనంగా భరించిన బీఆర్ఎస్, ఇప్పుడు తన రూట్ మార్చింది.

BRS Party : తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. చలికాలంలోనూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. అయితే ఇన్ని రోజులు ప్రత్యర్థుల విమర్శలను మౌనంగా భరించిన బీఆర్ఎస్, ఇప్పుడు తన రూట్ మార్చింది. ఇకపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వదిలిపెట్టకూడదని, వెంటనే 'మాటకు మాట' బదులు ఇవ్వాల్సిందేనని గులాబీ దళం గట్టి నిర్ణయానికి వచ్చింది. దీనికోసం పార్టీ అధిష్ఠానం ఒక ప్రత్యేక 'కౌంటర్ టీమ్'ను రంగంలోకి దించుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఆ ఒక్క తప్పు వల్లే అధికారం కోల్పోయామని రియలైజేషన్!

పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే విమర్శలు వస్తుంటాయని బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా, అవేవీ పెద్దగా లెక్కచేయకుండా బరిలోకి దిగారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన సమీక్షలో ఆ మౌనమే తమ కొంపముంచిందని నేతలు గుర్తించారు. తమపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో కౌంటర్ ఇవ్వకపోవడం వల్లే, అవే నిజాలని ప్రజలు నమ్మారని, ఫలితంగా అధికారం కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

రంగంలోకి ప్రత్యేక టీమ్..

అధికారం కోల్పోయి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఇంకా తమపై విమర్శలు ఆగకపోవడంతో, మరోసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని బీఆర్ఎస్ హైకమాండ్ కింది స్థాయి నేతలకు స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే ప్రతి విమర్శను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ఒక ప్రత్యేక టీమ్ సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

అధికార పార్టీ నుంచి మంత్రులు విమర్శిస్తే వెంటనే మాజీ మంత్రులు రంగంలోకి దిగాలని, ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తే కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కౌంటర్ ఇవ్వాలని ఇంటర్నల్‌గా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర నేతలు విమర్శలు చేస్తే స్థానిక నేతలు వెంటనే స్పందించాలని ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర స్థాయి అంశాలైతే తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్లు పెట్టాలని, కానీ జిల్లా స్థాయి సమస్యలు లేదా ఆరోపణలపై హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లు పెట్టడం సరికాదని నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయా జిల్లా కేంద్రాల్లోనే ప్రెస్ మీట్లు పెట్టి, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు నిజాలు తెలిసేలా మాటకు మాట సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

మొత్తానికి, ప్రత్యర్థుల ఆరోపణలకు స్పందించకుండా ఉంటే అవి నిజమని జనం నమ్మే ప్రమాదం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్, ఇకపై దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. మరి గులాబీ దళం అమలు చేయబోతున్న ఈ కొత్త 'కౌంటర్ స్ట్రాటజీ' రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

తర్వాత చదవండి