పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త సంవత్సరం (జనవరి 1) తర్వాత కూడా ఇరు దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై తిరిగి భారీ స్థాయిలో సైనిక దాడులు ప్రారంభించేందుకు తాను వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ప్రతినిధులు కేవలం కాలయాపన చేస్తున్నారని, ఎలాంటి రాజీకి రాకుండా చర్చలను ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) సవాల్ చేసేందుకు టెహ్రాన్ సిద్ధమవుతోందన్న వార్తలపైనా డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దిగ్బంధనాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ఇరాన్ చమురు ట్యాంకర్లు ప్రయత్నిస్తే, వాటిని సముద్ర గర్భంలోకి ముంచివేస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
గతంలో ఇరాన్ నౌకాదళానికి పట్టిన గతే ఈ నౌకలకు కూడా పడుతుందని, అమెరికా సైనిక బలగాలు ఆంక్షలను అతిక్రమించే ప్రతి నౌకను ధ్వంసం చేస్తాయని తేల్చిచెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునే అవకాశాలను శాశ్వతంగా మూసివేసేలా ఒక కచ్చితమైన ఒప్పందం కుదరాలని వాషింగ్టన్ కోరుకుంటోందని ట్రంప్ పునరుద్ఘాటించారు. మరోవైపు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తున్నాయి.
జలసంధి తూర్పు భాగంలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన రెండు చమురు ట్యాంకర్లు మైన్లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని ఇరాన్ మీడియా పేర్కొంది. అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తమ గగనతలంలోకి వచ్చిన అమెరికా ప్రిడేటర్ డ్రోన్‌ను కూల్చివేయడంతో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా గగనతల రక్షణ రాడార్ వ్యవస్థలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అరేబియా సముద్రంలో అమెరికా రెండు విమాన వాహక నౌకా సమూహాలను మోహరించి నిరంతరం నిఘా ఉంచుతోంది.
షరతులకు అంగీకరిస్తే హర్ముజ్‌ను తెరుస్తాం: ఇరాన్
ఇదిలా ఉండగా, తమ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, అంతర్జాతీయ చట్టాలకు లోబడి సహేతుకమైన షరతులకు అంగీకరిస్తే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు. అయితే చర్చలు ఒకవైపు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పరస్పర దాడులు ఆగకపోవడంతో, రాబోయే కొద్ది వారాలు ఇరు దేశాల మధ్య శాంతి లేదా పూర్తి స్థాయి యుద్ధాన్ని నిర్ణయించే కీలక దశగా మారాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
