వ్యాపారం

Bisleri water: ‘బిస్లరీ’ వాటర్ తాగే వారికి షాక్.. ల్యాబ్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు!

ప్రముఖ బ్రాండ్ 'బిస్లరీ' (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై తీవ్ర వివాదం నెలకొంది. బిస్లరీ వాటర్ నమూనాలు తాగడానికి సురక్షితం కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా స్పష్టం చేసింది.

ప్రముఖ బ్రాండ్ 'బిస్లరీ' (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై తీవ్ర వివాదం నెలకొంది. బిస్లరీ వాటర్ నమూనాలు తాగడానికి సురక్షితం కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా స్పష్టం చేసింది. బిస్లరీ తయారీ ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా, నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి 'బ్రోమేట్' (Bromate) రసాయనం ఉన్నట్లు వెల్లడైంది.

ఈ ఫలితాలపై బిస్లరీ సంస్థ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్‌లో మరోసారి పునఃపరీక్షలు నిర్వహించగా, అందులోనూ నీరు సురక్షితం కాదని, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాటర్ బాటిళ్ల తయారీ, పంపిణీ జరుగుతోంది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS Act) 2006 నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో బిస్లరీ నీటి నమూనాను సురక్షితం కాదని(Unsafe) ఆదివారం ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించింది.

 అంతేకాకుండా ఈ వ్యవహారంలో సదరు సంస్థపై తదుపరి చట్టపరమైన విచారణ జరిపేందుకు నియంత్రణ సంస్థ అనుమతి మంజూరు చేసింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు, సామాన్యులు విశ్వసించి కొనుగోలు చేసే బ్రాండెడ్ నీటి నాణ్యతపై ఈ తరహా నివేదిక వెలువడటం వినియోగదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం బిస్లరీ మాత్రమే కాకుండా ఆహార నాణ్యత నిబంధనలను ఉల్లంఘించిన పలు ఇతర సంస్థలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా ఝళిపించింది. వసంత మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాన్సా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ కంపెనీలపై విచారణకు అనుమతులు జారీ చేసింది.

వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఊర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ లైసెన్సులను తక్షణమే నిలిపివేస్తూ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తయారీ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తన నిఘాను ముమ్మరం చేసింది. రెడ్ బుల్ (Red Bull) వంటి ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నందున 'ఎనర్జీ డ్రింక్' లేబుల్ వాడకంపై నియంత్రణ సంస్థ ఆంక్షలు విధించగా, రెడ్ బుల్, పెప్సికో, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్ కన్స్యూమర్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందాయి. ఆ వివాదం కొనసాగుతున్న తరుణంలోనే బిస్లరీ వాటర్ నాణ్యత అంశం తెరపైకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తర్వాత చదవండి