TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై గత వారం రోజులుగా సీబీఐ బృందం ఆరా తీస్తుండటంతో కంటోన్మెంట్ ఆఫీసులో కలకలం మొదలైంది.
కోర్టుకు వెళ్లడంతో కదిలిన దర్యాప్తు
కంటోన్మెంట్ ఏరియాలో బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కొందరు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఫిర్యాదుదారులు నేరుగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, గత వారం రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు.
15 ఏళ్ల నాటి కేసులో ఏం జరిగింది?
ఈ విచారణలో భాగంగా 15 ఏళ్ల నాటి పాత విషయాలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, అంటే 2011లోనూ కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంపై సీబీఐ విచారణ జరిపి, అప్పట్లో 8 మంది ఇంజినీరింగ్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. అయితే ఆ 8 మంది అధికారుల్లో ఆరుగురు ఇప్పటికే రిటైర్ అయిపోగా, మిగిలిన ఇద్దరు ప్రస్తుతం కీలకమైన ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
15 ఏళ్ల క్రితం సీబీఐ కేసు పెట్టినప్పటికీ, ఆ అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాత కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారే నేటికీ పెద్ద పదవుల్లో ఉండటం వల్లే ఇక్కడ అక్రమాలు ఆగడం లేదని అంటున్నారు. ఇప్పుడు సీబీఐ గత మూడేళ్ల ఫైళ్లను తనిఖీ చేస్తుండటంతో, అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో గుబులు మొదలైంది.
