Chiranjeevi: నన్ను మందు తాగమని చాలామంది ఒత్తిడి చేశారు..నిర్మొహమాటంగా నో చెప్పా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నషా ముక్త్ భారత్ సభలో మాట్లాడిన అంశంపై చిరంజీవి యువతను ఉద్దేశించి తన అనుభవాలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన నేటి యువతకు కీలక సందేశం ఇచ్చారు. అంతేకాదు, తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను కూడా గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను కూడా చాలామంది మద్యం తాగమని..ఒక్కసారికి ఏమవుతుందిలే అంటూ ఒత్తిడి చేశారని, చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే, నేను ఆంజనేయస్వామి భక్తుడిని.. అలాంటి అలవాట్లకు దూరంగా ఉన్నాను..అన్న విషయాన్ని వారితో స్పష్టం చేసినట్టుగా తెలిపారు.
మందు తాగమని ఒత్తిడి చేసినా నో చెప్పాను!
సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు, సామాజికంగా కలిసే సందర్భాల్లోనూ మద్యం తాగాలని చాలామంది ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు చిరంజీవి. అయితే ఎదుటివారు చెబుతున్నారని.. ఏ చెడు అలవాటుకీ బానిస అవ్వాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఆయన.. యువతకు అందించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే మన లక్ష్యాలపై దృష్టి పెట్టగలమని సూచించారు.
నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మెగా సపోర్ట్:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇంతకముందు ప్రభాస్, నిఖిల్, పాయల్ రాజ్పుత్ సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు బాధ్యతగా యువతకి సందేశాలను ఇచ్చారు. ఇప్పుడు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చిరంజీవి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇక, ఇదే సమయంలో చెడు వ్యసనాలకు బానిసలైన వారిని దూరం పెట్టకుండా, వారికి మంచి సలహాలు, స్పూర్తినింపే మాటలు చెప్పి, ఆ అలవాట్ల నుంచి బయటపడేలా దోహదపడాలని కూడా సూచించారు. ఈ విధంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారుతోంది.
