తెలంగాణ

Delimitation Bill: డీలిమిటేషన్‌ బిల్లు.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

Delimitation Bill: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్). జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ పట్టు కోల్పోతాయనే ఆందోళన గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది.

Delimitation Bill: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్). జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ పట్టు కోల్పోతాయనే ఆందోళన గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ భయాలన్నింటికీ చెక్ పెడుతూ కొత్త డీలిమిటేషన్ బిల్లు సరికొత్త లెక్కలను తెరపైకి తెస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు ఏకంగా 50 శాతం పెరగబోతున్నాయి.

అసలు ఈ 50 శాతం ఫార్ములా ఏంటి?

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ కారణంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 లోక్‌సభ స్థానాలు కాస్తా ఏకంగా 195కు చేరబోతున్నాయి. అంటే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా (23.76 శాతం) ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా కొనసాగుతుంది. కేవలం ఎంపీ సీట్లు మాత్రమే కాకుండా, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇదే నిష్పత్తిలో భారీగా పెరగనున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయంటే?

కొత్త డీలిమిటేషన్ లెక్కల ప్రకారం దక్షిణాదిలోని కీలక రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య ఊహించని స్థాయిలో మారబోతోంది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, అవి 13 పెరిగి 38కి చేరనున్నాయి. ఇక 175గా ఉన్న అసెంబ్లీ సీట్లు 88 పెరిగి 263కు చేరుకుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. కొత్త విభజనతో మరో 9 సీట్లు అదనంగా వచ్చి మొత్తం సంఖ్య 26కు పెరుగుతుంది. అలాగే 119 అసెంబ్లీ స్థానాలు కాస్తా 60 పెరిగి 179కి చేరనున్నాయి.

దక్షిణాదిలో అత్యధికంగా తమిళనాడులో 39 లోక్‌సభ సీట్లు 20 పెరిగి 59కి చేరబోతున్నాయి. అసెంబ్లీ విషయానికొస్తే 234 స్థానాలకు అదనంగా 117 సీట్లు తోడై మొత్తం 351కి పెరుగుతాయి. కర్ణాటకలో ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉండగా, అవి 14 పెరిగి 42కు చేరుకుంటాయి. 224గా ఉన్న అసెంబ్లీ సీట్లు 112 పెరిగి 336కు చేరనున్నాయి. వీటితో పాటు కేరళలోనూ 20 లోక్‌సభ స్థానాలు 10 పెరిగి 30కి, 140 అసెంబ్లీ సీట్లు 70 పెరిగి 210కి చేరనున్నాయి.

2029 ఎన్నికల నాటికి మారనున్న రాజకీయ ముఖచిత్రం

ఈ డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ రాజకీయ స్వరూపమే మారిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది అంతటా వందల సంఖ్యలో కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు, 2051 వరకు ఇదే నిష్పత్తి కొనసాగేలా నిబంధనలు రూపొందిస్తుండటంతో రాబోయే పాతికేళ్ల పాటు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతకు ఎలాంటి ఢోకా ఉండదు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ఇప్పటి వరకు టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది కొత్త నేతలకు రాజకీయంగా భారీ అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి.

తర్వాత చదవండి