ఏపీ

హుటాహుటిన ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కీలక భేటీ!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఎన్డీఏ (NDA) నాయకత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇద్దరు నేతలు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఎన్డీఏ (NDA) నాయకత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇద్దరు నేతలు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి.

 ఎన్డీఏ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర నాయకత్వం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమలుతో ముడిపడి ఉన్న బిల్లులపై కీలకంగా చర్చించనుంది. ఈ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఎలాగైనా ఆమోదం పొందేలా తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు వ్యూహాలపై ఎన్డీఏ సమావేశంలో కసరత్తు చేయనున్నారు.

 గత ఏప్రిల్‌లో జరిగిన సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆమోదం పొందని నేపథ్యంలో, ఈసారి మిత్రపక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, సీట్ల పెంపు వంటి అంశాలపై చంద్రబాబు గతంలోనే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే సీట్ల నిష్పత్తిలో మార్పులు వస్తాయన్న చర్చ నడుస్తుండగా, లోక్‌సభ స్థానాలను పెంచి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసే విధానంపై ఎన్డీఏ కూటమి నేతల మధ్య సమన్వయం కీలకంగా మారింది. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, పునర్విభజన ద్వారానే అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం, మిత్రపక్షాల వ్యూహాలు, సభలో అనుసరించాల్సిన వైఖరిపై ఎన్డీఏ భేటీలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ జగన్ గతంలోనే సూత్రప్రాయంగా బిల్లులకు మద్దతు ప్రకటించినప్పటికీ, కీలక షరతులు, హామీలపై స్పష్టత కోరారు.

 మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని స్వాగతించిన జగన్, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీ మహిళలకు 50 శాతం వాటా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ, ఎన్నికల ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రం నుంచి స్పష్టమైన భరోసా ఉండాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి, షరతులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తర్వాత చదవండి