వరుస పెరుగుదల తర్వాత ఆదివారం (నవంబర్ 29, 2026) బంగారం ధరలు(Gold price) నిలకడగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో నిత్యం మారుతున్న రేట్లతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఈ విరామం కొంత సాంత్వననిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,27,860 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ. 1,17,200 వద్ద కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల ధర రూ. 1,28,010గా, 22 క్యారెట్ల ధర రూ. 1,17,350గా నమోదైంది.
వివిధ ప్రాంతాల్లో పసిడి రేట్లలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ, వెండి ధరలు మాత్రం ప్రధాన నగరాల్లో ఒకే స్థాయిలో నిలిచాయి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 1.70 లక్షల వద్ద ట్రేడవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొనుగోళ్ల సందడి ఉన్నప్పటికీ, గత ఐదు రోజుల వరుస పెరుగుదల తర్వాత రేట్లు స్థిరపడటంతో నగల కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
గత ఆరు రోజుల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ 23న హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,25,070 ఉండగా, 29 నాటికి రూ. 2,790 పెరిగి రూ. 1,27,860కి చేరింది; 22 క్యారెట్ల ధర కూడా రూ. 1,14,640 నుంచి రూ. 2,560 పెరిగి రూ. 1,17,200 వద్దకు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,25,220 నుంచి రూ. 1,28,010కి, 22 క్యారెట్ల ధర రూ. 1,14,790 నుంచి రూ. 1,17,350కి ఎగబాకాయి.
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో మాత్రం ఈ వారం తగ్గుదల కనిపించింది. నవంబర్ 23న కిలో వెండి రూ. 1.75 లక్షలుగా ఉండగా, నవంబర్ 29 నాటికి రూ.1.70 లక్షలకు దిగివచ్చింది. రానున్న రోజుల్లో డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలను బట్టి పసిడి, వెండి ధరలు ఎలా ఉంటాయోనని కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
