తెలంగాణ

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. త్వరలో మరో 25 వేల సర్కారీ కొలువులు!

నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని, అతి త్వరలోనే మరో 25వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

 నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని, అతి త్వరలోనే మరో 25వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం ఈ కీలక ప్రకటన చేశారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన వ్యాఖ్యలతో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం, ఇప్పటికే భర్తీ చేసిన 75 వేల పోస్టులకు అదనంగా రాబోయే 25వేల నియామకాలు కూడా పూర్తయితే రాష్ట్రంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యం నెరవేరనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ నియామకాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల కోసం వేలాది మంది అభ్యర్థులు నిరంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

ఈ తరుణంలో అదనపు ఉద్యోగాల భర్తీపై సీఎం ఇచ్చిన హామీ నిరుద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు, కొత్తగా భర్తీ చేయబోయే 25వేల ఉద్యోగాలకు సంబంధించి ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై అభ్యర్థుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏయే కేటగిరీల కింద నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? నియామక ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయాలపై యువత ఆరా తీస్తోంది.

 ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి సమాచారం అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడికావాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటికే 75వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న గణాంకాలతో పాటు త్వరలో మరో 25వేల కొలువులు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సంబంధిత నియామక బోర్డుల నుంచి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయా అని నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తర్వాత చదవండి