Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీశ్ రావు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ లో రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు పరిశీలించారు. వడ్లు మార్కెట్ లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నమ్మి సన్నాలు సాగు చేసినందుకు రైతులు నష్టపోతున్నారని వాపోయారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లను కూడా కొనే దిక్కు లేదన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులదే రాజ్యమైందన్నారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ జరిపి రైతులను ఆదుకోవాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక తీవ్రంగా నష్టపోతున్నారు
వరి ధాన్యం కొనుగోలుపై రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు హరీశ్ రావు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంపేట్ మండల కేంద్రంలో ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేదన్నారు. కొబ్బరి కాయలు కొట్టారు కానీ గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని తెలిపారు. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నుండి ఫోన్లు చేస్తున్నారని.. 26 వందలకు మాత్రమే సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతుకు బోనస్ ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ మాట నమ్మి సన్నాలు సాగు చేసినందుకు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం కొనకపోవడంతో దళారులదే రాజ్యమైంది
''చాలా జిల్లాల్లో 26, 27 వందలకే క్వింటాల్ అమ్ముతున్నారని అంటున్నారు. దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. క్వింటాల్ కు 10 కిలోలు తరుగు పెడుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 రోజుల నుండి అక్కడే వడ్లు పోసుకొని ఉంటున్నారు. మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారు. రుణమాఫీ చేయలేదు. ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు ఇష్టం ఉన్నట్లు కొంటున్నారు. దొడ్డు రకం వడ్లు 2200 క్వింటాల్ కొంటున్నారు. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు. రైతుకు బోనస్ విషయంలో జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లక్షల ఎకరాలు పంట ఎండింది. ఇప్పటివరకు లెక్కలు తీయలేదు.
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి రైతుకు ఎకరాకు 5వేలు సాయం చేశారు. తెలంగాణలోనూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. నాడు కేసీఆర్ పంటలు నష్టపోతే ఎకరాకు 10 వేలు ఇచ్చారు. యాసంగి రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయాలి. దొడ్డు వడ్లు కోతలు లేకుండా, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.
నల్ల వాగులో నీళ్లు ఉన్నాయి, నిజాం సాగర్ లో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు నింపండి. ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వండి. నారాయణఖేడ్ లో వలసలు పోతున్నారు. మహబూబ్ నగర్ నుండి వలసలు పోతున్నారు. ఇందిరాగాంధీ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టి ఆమెను కూడా గోస పెడుతున్నారు. ఇయ్యని పథకాలకు రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లు పెట్టడం ఎందుకు? ఇవ్వని పథకాలకు మీరు పేరు పెట్టుకోండి రేవంత్ రెడ్డి.
కొత్త బీమా ఇంటికి ఒక్కరికే అంటున్నారు
రైతు బీమా డబ్బులు కట్టక రైతు కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మీ కొత్త బీమా వచ్చేది దేవుడు ఎరుగు ఉన్న బీమా అమలు చెయ్యండి. కొత్త బీమా ఇంటికి ఒక్కరికే అంటున్నారు. దీని వల్ల ఏం లాభం? ఇప్పటివరకు 3 వేల మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మీ మాటలు కడుపు నింపవు రేవంత్ రెడ్డి. వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తానన్నారు. ఆ డబ్బులు విడుదల చేయాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


