తెలంగాణ

TG : సమ్మక్క సాగర్‌కు మోక్షం లభించనుందా?

5 నిమిషాల పఠనం

కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీ కట్టడం ఎప్పుడో పూర్తయింది.. కానీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఒక్క ఫర్మిషన్ రాక అందులో నీళ్లు నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ సాగునీటి రంగంలో పెండింగ్‌లో ఉన్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపిస్తోంది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ఫలించింది.

TG : కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీ కట్టడం ఎప్పుడో పూర్తయింది.. కానీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఒక్క ఫర్మిషన్ రాక అందులో నీళ్లు నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ సాగునీటి రంగంలో పెండింగ్‌లో ఉన్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపిస్తోంది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ఫలించింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో వీరు జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో, ఎన్‌ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ముప్పును దృష్టిలో ఉంచుకుని..

రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల సమ్మక్క సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకోవడం చాలా అవసరమని రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎంకు వివరించారు. బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తయినందున, ప్రజల అవసరాలను గుర్తించి ఎన్‌ఓసీతో పాటు మిగిలిన అనుమతుల విషయంలోనూ సహకరించాలని కోరారు. దీనికి విష్ణుదేవ్ సాయి వెంటనే సానుకూలంగా స్పందించడం తెలంగాణకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

అసలు ముంపు చాలా తక్కువే

నిజానికి ఈ ప్రాజెక్టును మొదట కాంతనపల్లి వద్ద కట్టాలనుకున్నారు. కానీ అక్కడైతే 11 వేల ఎకరాలకు పైగా భూమి, 17 ఆదివాసీ గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని గుర్తించి, బ్యారేజీని తుపాకులగూడెంకు మార్చారు. ఈ మార్పు తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఎంత భూమి ముంపునకు గురవుతుందో తేల్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం చేసింది. ఇందుకోసం ఛత్తీస్‌గఢ్ కోరిన రూ. 9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. జూలై 30న ఐఐటీ ఖరగ్‌పూర్ ఇచ్చిన నివేదిక ప్రకారం, బ్యారేజీని పూర్తిస్థాయిలో (+83 మీటర్లు) నింపినా ఛత్తీస్‌గఢ్‌లో కేవలం 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుంది. భారీ వరదలు వచ్చినా ఆ ప్రభావం 100 ఎకరాలకు మించదని స్పష్టమైంది.

పరిహారం చెల్లించడానికి తెలంగాణ సిద్ధం..

6.94 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ బ్యారేజీ అందుబాటులోకి వస్తే.. తెలంగాణలోని కరువు ప్రాంతాలు, గిరిజన గూడేలకు సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ఆ కొద్దిపాటి భూమికి కూడా రూల్స్ ప్రకారం పరిహారం, పునరావాస ఖర్చులు చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజా భేటీతో అడ్డంకులన్నీ తొలగిపోయే సూచనలు కనిపిస్తుండటంతో.. ఇన్నాళ్లూ నిరీక్షిస్తున్న సమ్మక్క సాగర్‌కు త్వరలోనే మోక్షం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

#Telangana News#Sammakka Sagar Barrage#Sammakka Sagar Project#Tupakulagudem Barrage#Telangana Irrigation Projects#Revanth Reddy#Uttam Kumar Reddy#Chhattisgarh CM Vishnu Deo Sai#Telangana Water Projects#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి