TG: తెలంగాణ కార్మిక శాఖలో ఇప్పుడు అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. రూల్స్ ప్రకారం నడవాల్సిన ప్రభుత్వ శాఖలో, మంత్రి కార్యాలయానికి చెందిన ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పెత్తనం మితిమీరిందన్న ఆరోపణలు సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అర్హతలు, సీనియారిటీని పక్కనపెట్టి తన బంధువులకు, తనకు కావాల్సిన వారికి కీలక పదవులు కట్టబెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బావమరిదికి ఐఎంసీ సీఈఓ పదవి కట్టబెట్టే స్కెచ్!
ఈ వివాదంలో అన్నింటికంటే సంచలనంగా మారిన అంశం బంధుప్రీతి. ఐఎంసీ బోర్డు సీఈఓగా తన సొంత బావమరిది ప్రమోద్ రెడ్డిని నియమించేందుకు ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు శాఖలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రిని కూడా ఒప్పించే ప్రయత్నం జరిగినట్లు సమాచారం. అసలు ఆ కీలక పోస్టుకు కావాల్సిన విద్యార్హతలు, పరిపాలనా అనుభవం, సర్వీస్ రికార్డు సదరు వ్యక్తికి ఉన్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం బంధువు అన్న ఒక్క కారణంతో ఉన్నత పదవిని కట్టబెట్టాలని చూడటం పారదర్శకతకు విరుద్ధమని ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
ఈడీ కేసుల్లో ఉన్నవాళ్లకు క్లీన్‌చిట్ ఇచ్చేలా ఒత్తిళ్లు?
మరోవైపు ఐఎంఎస్ డైరెక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్ నియామకంతో పాటు, డాక్టర్ పద్మకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇక్కడ అత్యంత తీవ్రమైన ఆరోపణ ఏంటంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలు, కేసులు ఎదుర్కొంటున్న కొందరు ఐఎంఎస్ సభ్యులకు శాఖాపరంగా 'క్లీన్‌చిట్' ఇచ్చేందుకు ఓఎస్డీ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం. దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతున్న సమయంలో, చట్టపరమైన అంశాలను పక్కనపెట్టి ముందస్తుగా క్లీన్‌చిట్ ఇవ్వాలని చూడటం, పోలీసు విచారణ అవసరమైన కేసులను కూడా కేవలం శాఖాపరమైన విచారణతోనే ముగించాలని ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
రూల్స్ మాట్లాడిన కార్యదర్శిపైనే బురదజల్లే యత్నం
ఈ అడ్డగోలు వ్యవహారాలకు శాఖ కార్యదర్శి అడ్డుకట్ట వేయడంతోనే అసలు రచ్చ మొదలైందని తెలుస్తోంది. నియామకాలు, పదోన్నతులు, విచారణలన్నీ రూల్స్, సీనియారిటీ ప్రకారమే జరగాలని కార్యదర్శి స్పష్టం చేస్తున్నారు. తాము చెప్పినట్టు వినడం లేదన్న అసహనంతోనే, కార్యదర్శిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, శాఖలోని అంతర్గత విషయాలను బయటకు లీక్ చేస్తూ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ పదవులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి కార్మిక శాఖలో జరుగుతున్న ఈ రచ్చపై మంత్రి ఎలా స్పందిస్తారు? రూల్స్ వైపు నిలబడిన కార్యదర్శికి ప్రభుత్వం అండగా ఉంటుందా? అన్నది వేచి చూడాలి.


