ఆటో మీటర్ ఛార్జీలను సవరించడంతో పాటు డ్రైవర్ల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ (JAC) రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 30న హైదరాబాద్ నగరంలో ఒక రోజు పూర్తి స్థాయి ఆటోల బంద్‌కు పిలుపునిచ్చింది. అవసరమైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.
నగరంలో గ్రీన్ క్యాబ్‌లను ప్రభుత్వం అనుమతించడం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పొట్టకొడుతున్నారని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రీన్ క్యాబ్ సర్వీసులను నిషేధించడంతో పాటు ఆటో బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రూ.12 వేల చొప్పున ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లోనూ బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించాలని వారు స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన హింసాత్మక దాడిలో మృతి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ముకరం కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. గతంలో 14 డిమాండ్లతో జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపు నేపథ్యంలో అధికారులు స్పందించి కేరళ, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని ఆటో ఛార్జీల విధానాన్ని అధ్యయనం చేశారు.
12ఏళ్లుగా నగరంలో ఆటో కనీస ఛార్జీలు మారకపోవడం, పెరిగిన ఇంధన ధరలు, బీమా ప్రీమియంలు, విడిభాగాల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు పెంచాలని అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారిక ఉత్తర్వులు వెలువరించాలని ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


