తెలంగాణ

Hyderabad Metro: రాజకీయ రచ్చలో హైదరాబాద్ మెట్రో.. ఆ ఇద్దరు నేతలు కలిసి అడ్డుకున్నారా?

Hyderabad Metro: లక్షలాది మంది హైదరాబాదీలకు నిత్యం ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మెట్రో రైలు, ఇప్పుడు తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రణరంగానికి కేంద్రబిందువుగా మారింది. ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కాస్తా, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

Hyderabad Metro: లక్షలాది మంది హైదరాబాదీలకు నిత్యం ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మెట్రో రైలు, ఇప్పుడు తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రణరంగానికి కేంద్రబిందువుగా మారింది. ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కాస్తా, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా మెట్రో టేకోవర్ కోసం రావాల్సిన రూ. 13,600 కోట్ల రుణం ఆగిపోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ రుణాన్ని అడ్డుకున్నారా? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 13,600 కోట్ల రుణం తీసుకోవాలని ప్లాన్ చేసింది. మే నెలలోనే దీనికి సంబంధించిన రుణ ఒప్పందం కుదిరిందని, అవసరమైన పత్రాలన్నీ సమర్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరుతూ, గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఆ భేటీ తర్వాత చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం ప్రకటించారు.

కానీ, ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన కామెంట్స్ ఈ కథను ఒక్కసారిగా మలుపు తిప్పాయి. మెట్రో ఫేజ్-2 తన శాఖ పరిధిలోకి రాదని, అసలు IRFC రుణం గురించి తనకు తెలియదని ఆయన అన్నట్లు వార్తలు రావడంతో అందరూ విస్తుపోయారు. గతంలో స్వయంగా సీఎం వచ్చి కలిసినప్పుడు జరిగిన చర్చలేంటి? రుణం విడుదలపై అప్పుడు ఇచ్చిన హామీ ఏమైంది? ఇప్పుడు ఆ ఫైల్ ఎవరి దగ్గర ఆగిపోయింది? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

కేటీఆర్, కిషన్ రెడ్డిలపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

రైల్వే మంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణకు రావాల్సిన మెట్రో రుణాన్ని కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై అడ్డుకున్నారని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే మంత్రిపై వీరిద్దరూ ఒత్తిడి తెచ్చి నిధులు రాకుండా చేశారని, కేవలం రాజకీయ స్వార్థంతోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అయితే, సీఎం చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై అటు కేటీఆర్ నుంచి గానీ, ఇటు కిషన్ రెడ్డి నుంచి గానీ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. నిజంగానే రాజకీయ ఒత్తిళ్ల వల్ల రుణం నిలిచిపోయిందా? లేక రుణ విడుదలకు సంబంధించిన సాంకేతిక షరతులు ఇంకా పూర్తి కాలేదా? అనే విషయంపై అటు కేంద్రం, ఇటు IRFC స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం ముందున్న దారేంటి?

రూ. 13,600 కోట్ల రుణం సకాలంలో విడుదల కాకపోవడంతో, మెట్రో టేకోవర్ గడువును రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ వరకు పొడిగించాల్సి వచ్చింది. ఈ జాప్యం ప్రభావం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక మెట్రో ఫేజ్-2 విస్తరణపైనా పడే ప్రమాదం కనిపిస్తోంది. నగరంలో 122 కిలోమీటర్ల మేర రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. కానీ, ముందుగా ఫేజ్-1 టేకోవర్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం మెలిక పెట్టినట్లు సమాచారం.

అంటే ఫేజ్-1 రుణం ఆలస్యమయ్యే కొద్దీ, ఫేజ్-2 పనులు మరింత వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధుల విడుదల కోసం ఇంకా వేచి చూడాలా? లేక ప్రత్యామ్నాయంగా మరో ఆర్థిక సంస్థ నుంచి రుణం సమీకరించుకోవాలా? అనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. మొత్తానికి మూడు పార్టీల మధ్య రాజకీయ రైలు వేగంగా పరిగెడుతున్న వేళ, హైదరాబాద్ మెట్రో విస్తరణ పట్టాలెక్కుతుందా లేక ఈ రాజకీయ రచ్చలో రుణం దగ్గరే ఆగిపోతుందా అనేది వేచి చూడాలి.

తర్వాత చదవండి