TG: టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడు దేశంలోనే ఓ సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. ఇండియాలోనే ఫస్ట్ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' పోలీస్ స్టేషన్‌గా నిలవబోతోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇక్కడ సామాన్యులు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దగ్గర్నుంచి, కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ వేసే వరకు ప్రతి పనిలోనూ ఏఐ టెక్నాలజీని వాడబోతున్నారు.
డీజీపీ, సీపీ సడెన్ విజిట్..
ఈ కొత్త టెక్నాలజీ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకునేందుకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్ బుధవారం పంజాగుట్ట స్టేషన్‌కు సడెన్ విజిట్ చేశారు. స్టేషన్‌లో జరుగుతున్న టెక్నికల్ పనులను దగ్గరుండి చూసిన ఉన్నతాధికారులు, అక్కడికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. ఏఐ సిస్టమ్ ద్వారా సిబ్బంది తమ సమస్యలను ఎలా తీసుకుంటున్నారు? పరిష్కారం ఎంత వేగంగా జరుగుతోంది? అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్‌లోని ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఏఐ సాయంతో డ్యూటీ చేస్తున్న తీరును దగ్గరుండి గమనించారు.
త్వరలోనే అధికారికంగా ప్రారంభం
ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మురళీ కృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్‌లతో కలిసి స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిస్టమ్స్‌ను డీజీపీ, సీపీ పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ దేశపు తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌ను త్వరలోనే అధికారికంగా ఓపెన్ చేయబోతున్నట్లు వారు చెప్పారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీజీపీ ఆకున్ సబర్వాల్, హైదరాబాద్ అడిషనల్ సీపీ ఎం.శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్, టీఎస్‌పార్క్ ఎస్పీ రూపేష్, డీసీపీ అరవింద్ బాబు తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పంజాగుట్టలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో మిగతా పోలీస్ స్టేషన్లలోనూ ఇదే తరహా స్మార్ట్ పోలీసింగ్ అందుబాటులోకి రానుంది.
