Pujita Ponnada: హీరోయిన్ పూజిత పొన్నాడ ఆదర్శకుటుంబం సినిమా విషయంలో మోసపోయింది. స్వయంగా, ఈ విషయాన్ని తానే పలు ఇంటర్వ్యూలలో చెప్పి వాపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శకుటుంబం’. ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాలో నటించిన యువనటి పూజిత పొన్నాడ తాజాగా, చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముందు తనకు మంచి పాత్ర ఇస్తామని చెప్పిన చిత్ర బృందం, ఆ తర్వాత.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన స్థానంలో మరో నటిని తీసుకున్నారని పూజిత వాపోయింది. అంతేకాదు, తను నటించిన సన్నివేశాన్ని సినిమాలో ఉపయోగించుకున్నప్పటికీ, కనీసం క్రెడిట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
పూజిత తెలిపిన వివరాల ప్రకారం.. తను యూకేలో ఉన్న సమయంలో ‘ఆదర్శకుటుంబం’ సినిమా టీమ్ నుంచి కాల్ వచ్చిందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మంచి పాత్ర ఉందని, ఆడిషన్ కోసం హైదరాబాద్ రావాలంటూ చెప్పారట. పెద్ద దర్శకుడి సినిమా కావడంతో ఎంతో సంతోషంగా హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్స్, ఫొటో షూట్స్‌లో పాల్గొన్నదట. ఇవన్నీ చూసిన త్రివిక్రమ్ ఆమెను ఎంపిక చేశారని, కథను కూడా పూర్తిగా వినిపించారని చెప్పుకొచ్చింది.
తన పాత్ర సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందని.. నారా రోహిత్ కి జంటగా, ఆయనతో మంచి సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని చెప్పడంతో ఎంతో ఎగ్జైట్ అయ్యానని పూజిత తెలిపింది. ఫస్ట్ షెడ్యూల్‌లో తన పాత్రకి సంబందించి ఐదు రోజుల పాటు షూటింగ్ జరిగిందని పూజిత వెల్లడించింది. నారా రోహిత్‌తో కాంబినేషన్ సీన్స్ తో పాటు తన ఎంట్రీ సీన్స్ కూడా షూట్ చేశారని చెప్పింది.
అయితే, ఆ తర్వాత, రెండవ షెడ్యూల్‌కు సంబంధించి చాలా రోజుల వరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదని చెప్పింది. తీరా చూస్తే, అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా తన పాత్రలో మార్పులు జరిగాయని..దీనికొసం ఇంకొకరిని తీసుకున్నారని తెలిసిందట. దీంతో, తాను చాలా బాధపడినట్టుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ. ప్రస్తుతం, తన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
