కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో దేశీయ కంపెనీలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం భారత యువత, ఉద్యోగులు విదేశీ సంస్థలు తయారు చేసిన ఏఐ టూల్స్, మోడల్స్‌ను వాడుతున్నాయి.మున్ముందు ఇతర దేశాల మీద ఆధారపడకూడదని ప్రధాని మోడీ పిలుపు మేరకు స్వదేశీ సాంకేతిక త సాయంతోనే ఇక్కడి కంపెనీలు ఏఐ మోడల్స్,టూల్స్ తయారీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే స్వదేశీ 'చారియట్-1' (Chariot-1) ఏఐ మోడల్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ (India AI) మిషన్ కింద 'చారియట్-1' ఫౌండేషన్ మోడల్స్ విడుదలయ్యాయి. దీనిని దేశంలోనే పూర్తిగా అభివృద్ధి చేసినట్టు తెలిసింది.
ఎవరు తయారుచేశారంటే..
దేశానికి చెందిన చారియట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది.సువ్రత్ భూషణ్, పార్థ్ సారథి ఈ సంస్థ సహ-వ్యవస్థాపకులు. విదేశీ మోడల్స్‌పై ఆధారపడకుండా, భారత్‌లోనే మొదటి నుండి దీనికి శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏఐ మోడల్‌లో ‘టెక్స్ట్ కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ (LLM - 11 బిలియన్ పారామీటర్లు), టెక్స్ట్‌ను స్పీచ్‌గా మార్చే ‘టెక్స్ట్-టు-స్పీచ్’ (TTS) మోడల్ ఉన్నాయి.
లాంగ్వేజ్ సామర్థ్యం..
ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా 10 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.సంఖ్యలు, తేదీలు, కరెన్సీలను సందర్భానుసారంగా 97% కచ్చితత్వంతో పలుకుతుందని దీనిని తయారుచేసిన వారు ప్రకటించారు. భారతీయ లిపి, భాషల కోసం రూపొందించిన IndicShift టెక్నాలజీ వల్ల టోకెన్ల వినియోగం 2.5 రెట్లు తగ్గి వేగం పెరుగుతుంది. అలాగే నెస్టెడ్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ వేగం 62% మెరుగైంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ టూల్ కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదు. మొబైల్స్, పర్సనల్ ల్యాప్‌టాప్‌లు,భారీ సర్వర్లు అన్నింటిలోనూ పనిచేస్తుంది. ఇందులో 10.7B, 1.7B, 745M అనే మూడు వేర్వేరు సైజుల మోడల్స్ ఉన్నాయి. చిన్న సైజు (745M, 1.7B) మోడల్స్ తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ఎడ్జ్ డివైజ్‌లలో నేరుగా రన్ అవుతాయి.
ఫ్రీగా ఇస్తారా?
ప్రస్తుతం ఇది ChatGPT లాగా సాధారణ వినియోగదారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి రాలేదని సమాచారం.ప్రధానంగా డెవలపర్లు, పరిశోధకులు, కంపెనీల కోసం దీనిని రూపొందించినట్టు సమాచారం. దీనిలోని ఇండిక్ షిఫ్ట్ టెక్నాలజీని పూర్తిగా ఉచితంగా (Open-source) అందించినట్టు సమాచారం. డెవలపర్లు chariot.in వెబ్‌సైట్ ద్వారా API సహాయంతో (Python వంటి కోడింగ్ ద్వారా) తమ యాప్స్, ప్రభుత్వ హెల్ప్‌లైన్లు, చాట్‌బాట్‌లలో దీనిని ఉచిత ట్రయల్ లేదా నిర్ణీత ధరల ప్లాన్ల కింద ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.
