రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అర్హల ఓట్లను తొలగిస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఓట్లు ఎక్కువగా డిలీట్ అవుతున్నాయని ఆరోపించారు.
3 కోట్ల మందిలో నాలుగోవంతు చనిపోయారా?
మూడు కోట్ల మంది ఓటర్లున్న రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ది హిందూ హడిల్’ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైనదని, ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికావడం అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామమని పేర్కొన్నారు.
‘నేను వరుసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించాను. సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉంటూ రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాను. అలాంటి నాకు కూడా 73.18 లక్షల మంది ఓటర్లు చనిపోయారనో, ఎక్కడికో వెళ్లిపోయారనో నమ్మడం సాధ్యం కావడం లేదు. ఇది సాధారణ గణాంకం కాదు. ప్రజాస్వామ్యాన్ని అప్రమత్తం చేస్తున్న ప్రమాద ఘంటిక’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు నిష్పాక్షికత, పారదర్శకత, ప్రజల విశ్వాసమే ప్రాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
అయితే, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితి ఏర్పడటం ఒక పౌరుడిగా తనను తీవ్రంగా కలవరపెడుతోందని చెప్పారు. దేశ భవిష్యత్‌ను ప్రభావితం చేసే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగనున్నదని గుర్తుచేశారు.
ఈ ప్రక్రియపై సమర్థమైన న్యాయపరమైన పరిహారానికి అవకాశం లేకపోవడం మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించరాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు.ఎన్నికల సంఘం తన ప్రతి చర్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని, భారీ స్థాయిలో జరిగిన ఓట్ల తొలగింపుపై పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
